కేరళలో ఘోర విమాన ప్రమాదం…రెండు ముక్కలైన ఎయిరిండియా విమానం

కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం(IX-1344) ప్రమాదం భారిన పడింది. శుక్రవారం రాత్రి 7.40 గంటలకు కోజికోడ్‌లోని కరిపూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి రన్‌వేపై క్రాష్ అయింది.
ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలు అయింది. వందే భారత్ మిషన్‌లో భాగంగా విమానం దుబాయ్ నుంచి కోజికోడ్‌కు చేరుకుంది. ఈ విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
ప్రమాదంలో విమానం ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రాధమిక సమాచారం మేరకు ప్రమాదంలో పైలట్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు మృతిచెందినట్లు సమాచారం. 24 అంబులెన్స్‌లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. జిల్లా విపత్తు నిర్వహణ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
కేరళలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగానే ప్రమాదం జరిగిందని డీజీసీఏ ప్రకటించింది. ఎయిర్‌పోర్టులో భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.