మరోసారి ఢిల్లీలో డ్రగ్స్ కలకలం.. ఏకంగా రూ.2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం.. స్నాక్స్ మాటున సప్లయ్..

వారం రోజుల వ్యవధిలో ఢిల్లీలో పోలీసులు రూ.7వేల కోట్ల విలువ చేసే కొకైన్ ను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.

మరోసారి ఢిల్లీలో డ్రగ్స్ కలకలం.. ఏకంగా రూ.2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం.. స్నాక్స్ మాటున సప్లయ్..

Delhi Drugs Bust (Photo Credit : Google)

Updated On : October 11, 2024 / 2:02 AM IST

Delhi Drugs : ఢిల్లీలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రమేశ్ నగర్ లో డ్రగ్స్ నెట్ వర్క్ ను స్పెషల్ సెల్ పోలీసులు చేధించారు. 2వేల కోట్ల రూపాయల విలువైన 200 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల వ్యవధిలో ఢిల్లీలో పోలీసులు రూ.7వేల కోట్ల విలువ చేసే కొకైన్ ను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.

ఢిల్లీలో మరోసారి వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు కావడం సంచలనంగా మారింది. తాజాగా నమ్కిన్(స్నాక్స్) ప్యాకెట్ల మాటున సరఫరా చేస్తున్న రూ.2వేల కోట్ల విలువ చేసే 200 కిలోల కొకైన్ ను పోలీసులు పట్టుకున్నారు.

స్పెషల్ సెల్ పోలీసులు గురువారం మరో డ్రగ్ ట్రాఫికింగ్ బిడ్‌ను ఛేదించారు. రమేశ్ నగర్ ప్రాంతంలో ఒక గోదాం నుండి 2వేల కోట్ల రూపాయల విలువైన 200 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొకైన్‌ను రవాణా చేసేందుకు ఉపయోగించే కారులో జీపీఎస్‌ అమర్చడంతో డ్రగ్స్‌ గుట్టు రట్టయింది. పోలీసులు GPS లొకేషన్‌ను ట్రాక్ చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కేటుగాళ్లు ఎంతో తెలివిగా వ్యవహరించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. డ్రగ్స్ ను నమ్‌కీన్ (స్నాక్) ప్యాకెట్లలో దాచారు. అయినా, పోలీసుల ముందు వారి పాచికలు పారలేదు. అడ్డంగా దొరికిపోయారు. కొకైన్‌ను ఢిల్లీకి తీసుకురావడంలో కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి లండన్‌కు పారిపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇటీవలే దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లోని గోడౌన్‌లో అక్టోబర్ 2న రూ. 5వేల 620 కోట్ల విలువైన 560 కిలోల కొకైన్, 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తుషార్ గోయల్ (40), హిమాన్షు కుమార్ (27), ఔరంగజేబ్ సిద్ధిఖీ (23), భరత్ కుమార్ జైన్ (48) అనే నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని అమృత్‌సర్, చెన్నైలలో అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉత్తర భారత దేశంలో డ్రగ్స్ రవాణా చేసేందుకు ఆ వ్యక్త సాయపడే వాడు.

రూ.5వేల 620 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా ముఠాకు తాజాగా ఘటనతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ డ్రగ్స్ రాకెట్ తో లింక్ కలిగి ఉన్నట్లు భారత సంతతికి చెందిన దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త వీరేందర్ బసోయాపై ఢిల్లీ పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.

మొత్తంగా.. ఢిల్లీలో డ్రగ్స్ కార్యకలాపాలపై స్పెషల్ సెల్ ఉక్కుపాదం మోపుతోంది. పక్కా సమాచారంతో పకడ్బందీ ప్లాన్ తో డ్రగ్స్ ముఠాలను పట్టుకుంటోంది. ఇలా వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.7వేల 500 కోట్ల విలువైన 762 కేజీల కొకైన్ ను సీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల 560 కేజీల డ్రగ్స్ ను సీజ్ చేయగా, తాజాగా 200 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

 

Also Read : రోడ్డు పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్న స్నేహితులు..! రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది..