చేతిలో ఉన్న చెత్తబుట్టతో చైన్ స్నాచర్‌పై తిరగబడిన మహిళ, చింతల్‌లోని షాపులో ఘటన

ఓ మహిళ కళ్లలో కారంకొట్టి ఆమె మెడలో నుంచి చైన్ లాకెళ్లడానికి ప్రయత్నించిన ఓ చైన్ స్నాచర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్ధానికులు. జీడిమెట్ల పీఎస్ పరిధిలో చింతల్‌లోని ఓ షాపులో యజమానురాలు ఉర్మిళాదేవి కౌంటర్ మీద తన పని తాను చేసుకుంటుంది. అయితే ఒక్కసారిగా బైటి నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆటోలో వచ్చి ఉర్మిళా దేవి కళ్లలో కారం కొట్టి ..ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాకెళ్లడానికి ప్రయత్నించాడు.
వెంటనే ఆమె తేరుకొని తన వద్ద ఉన్న చెత్తబుట్టతో చైన్ స్నాచర్‌పై తిరగపడటంతో దొంగ ఆమెను వదిలేసి పారిపోతుండగా.. స్ధానికులు వెంబడించి చైన్ స్నాచర్‌ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్దలానికి చేరుకున్న పోలీసులు.. దొంగను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.