బావిలోని మెట్లపై కూర్చొని సెల్ఫీ..జారిపడి యువతి మృతి

సెల్ఫీ..మరో ప్రాణం తీసింది. భవిష్యత్ గురించి ఓ యువతి కన్న కలలన్నీ ఆ ఒక్క సెల్ఫీ మింగేసింది. త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన ఆ యువతి పాడెపై వెళ్లడం అందరి హృదయాలను కలిచివేసిన ఘటన తమిళనాడులో జరిగింది.
తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలోని పట్టాభిరామ్ ప్రాంతంలోని గాంధీనగర్ కి చెందిన టీ మెర్సీ స్టేఫీ(24)కి అదే ప్రాంతంలోని నవజీవన్ నగర్ నివాసి అప్పు(24) అనే యువకుడితో వారం క్రితం నిశ్చితార్థం జరిగింది. జనవరిలో ఇద్దరూ పెళ్లి పీటలపై ఎక్కాల్సి ఉంది. అయితే పెళ్లికి ముందు తనకు కాబోయేవాడితో సరదాగా బయటకు వెళ్లింది మెర్సీ. సోమవారం కందిగై గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలం దగ్గరకు మెర్సీ, అప్పు వెళ్లారు. సరదాగా మాట్లాడుకుంటూ.. అక్కడున్న బావి దగ్గరకు వెళ్లారు.
భవిష్యత్‌పై కలలు కంటూ ఇద్దరు సంతోషంగా సెల్ఫీలు దిగుతున్నారు. బావిలోని మెట్లపైన కూర్చొని సెల్ఫీ దిగుతున్న సమయంలో…యువతి మెట్టు కొనకు కూర్చొని ఉండడంతో ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి పోయింది. మెర్సీని కాపాడేందుకు అప్పు కూడా నీటిలో దూకి కేకలు వేశాడు. చుట్టు పక్కల ఉన్న వ్యక్తులు అక్కడికి చేరుకుని మెర్సీ, అప్పును బయటకు తీశారు. అయితే అప్పటికే మెర్సీ ప్రాణాలు కోల్పోయింది. అప్పు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.