స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ : కుర్రాళ్ల ప్రాణం తీసిన అతివేగం

  • Published By: veegamteam ,Published On : January 1, 2019 / 07:51 AM IST
స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ : కుర్రాళ్ల ప్రాణం తీసిన అతివేగం

గుంటూరు : అతివేగం నలుగురి ప్రాణం తీసింది. షాపింగ్ కోసం వెళ్లి అనంతలోకాలకు వెళ్లారు. ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు లారీ సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు రూరల్ మండలంలోని లాలుపురం శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది.

గుంటూరు విద్యానగర్ కు చెందిన సాదినేని ధనుష్ (18), శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామ శివారు తుమ్మలగుంట కోటేశ్వరరావు (19), పెదకూరపాడు మండలం కుంభంపాడుకు చెందిన సాయిరాం (18), పిడుగురాళ్లకు చెందిన షేక్ గఫూర్ (18)లు గుంటూరు రూరల్ మండలంలోని చౌడవరంలోని ఆర్ వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. 

ఉదయం కాలేజీకి వచ్చిన విద్యార్థులు న్యూ ఇయర్ షాపింగ్ కోసం గుంటూరు నగరానికి వెళ్లారు. షాపింగ్ చేసుకుని దొప్పలపూడి సత్య కౌశిక్ (ఏపీ 27 బీటీ0567) నెంబర్ గల ఐ-20 కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. గుంటూరు నగర శివారులోని బైపాస్ కు చేరుకోగానే విజయవాడలో షాపింగ్ చేద్దామనుకుని కారును నేషనల్ హై 16 మీదుగా విజయవాడ మళ్లించారు. కారు 160 కిమీ వేగంతో వెళ్తోంది. రెండు కిలోమీటర్లు ప్రయాణించాక మార్గంమధ్యలో గుంటూరు రూరల్ మండలంలోని లాలుపురం శివారు ప్రాంతంలో ముందు వెళ్తున్న మున్సిపల్ చెత్త తరలించే లారీని ఓవర్ టేక్ చేయబోయి లారీ వెనుక భాగంలో కారు బలంగా ఢీకొట్టింది. పక్కనే ఉన్న డివైడర్ ఎక్కి 30 మీటర్ల మేర దూసుకెళ్లి డివైడర్ లోని స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం 20-30 అడుగుల ఎత్తున గాలిలో పల్టీలు కొట్టుకుంటూ 50 మీటర్ల దూరంలో పడింది. కారు నుజ్జు నుజ్జు కావడంతో ధనుష్, తుమ్మలగుంట కోటేశ్వరరావు, సాయిరాం అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. తీవ్రంగా గాయపడిన షేక్ గఫూర్ గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆలోకం తారక్ హీరేంద్ర, దొప్పలపూడి సత్య కౌశిక్, ఆళ్ల శివాజీలకు గాయాలు అయ్యాయి. 

కారు ఢీకొట్టడంతో లారీ కూడా బైపాస్ ఎడమ వైపునున్న ఇనుప రెయిలింగ్ ను ఢీకొని బోల్తా పడింది. దీంతో లారీ డ్రైవర్ దేవరపల్లి కిరణ్ కుమార్, క్లీనర్ దుపాటి రాంచరణ్, మున్సిపల్ కార్మికుడు భూపతి రుద్రయ్య గాయపడ్డారు. వీరిని గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. మృతుల కుంటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.