Burglars Arrested : కూతురు రెక్కీ…. తల్లి చోరీ… తండ్రి కాపలా…. ఇదేం ఫ్యామిలీరా బాబూ…!

హైదరాబాద్ లో చోరీలకు పాల్పడుతున్న కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Burglars Arrested : కూతురు రెక్కీ…. తల్లి చోరీ… తండ్రి కాపలా…. ఇదేం ఫ్యామిలీరా బాబూ…!

Burglars Arrested In Kamatipura

Updated On : November 17, 2021 / 12:25 PM IST

Burglars Arrested :  ఎవ్వరైనా తమ పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి మంచి ఉద్యోగాల్లో హోదాలో చూడాలనుకుంటారు.  ఆడపిల్ల అయినా విద్యాబుధ్దులు నేర్పించి వారిని ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి మనవళ్లతో ఆడుకోవాలనుకుంటారు. కానీ హైదరాబాద్ లో చోరీలకు పాల్పడుతున్న కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ గజరావు భూపాల్ అందించిన వివరాల ప్రకారం…. మైలార్ దేవ్ పల్లి మొగల్ కాలనీకి చెందిన అబ్దుల్ సలీమ్ పాత బట్టల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతడి భార్య జకియా బేగం(43) వారికి ఆయేషా సిధ్ధిఖీ(19) అనే కూతురుంది. వీరు ముగ్గురు దొంగతనాలు వృత్తి గా చేసుకుని చోరీ చేసిన సొత్తు అమ్మి  జల్సాలు చేయటం మొదలెట్టారు.

కూతురు సిధ్దిఖీ  అందంగా అలంకరించుకుని చోరీ చేసే ఇంటి   ఏరియాలో నాలుగైదు సార్లు తిరిగి చోరీకి అనువుగా ఉన్న ఇంటిని సెలక్ట్ చేస్తుంది.  ఆవిషయాన్ని తల్లికి చేరవేస్తుంది.  ఆఇంట్లోకి వెళ్లిన   తల్లి… ఇంట్లోని విలువైన వస్తువులను చోరీ చేసి బయటకు వస్తుంది.  అప్పటి వరకు భర్త ఆ ఇంటి  బయట కాపలా కాస్తాడు. భార్య చోరీ చేసి వచ్చాక ముగ్గరూ కలిసి అక్కడి నుంచి పరారవుతారు.

Also Read : Star Tortoises : నక్షత్ర తాబేళ్లను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఎవరికైనా అనుమానం వచ్చి ప్రశ్నిస్తే అద్దె ఇంటికోసం వెతుకుతున్నామని  చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటారు.  2019 నుంచి ఈ కుటుంబం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతోంది.  ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారు. చోరీ చేసిన విలువైన వస్తువులను అమ్మటం కానీ, తాకట్టుపెట్టటం కానీ చేసి విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తుంటారు.

ఇటీవల చందూలాల్‌ బారాదరి, గుల్షన్‌నగర్‌, ఘాజిబండ… తదితర ప్రాంతాల్లో వరుసగా నాలుగు దొంగతనాలు  చేయటంతో కేసు నమోదు చేసుకున్న కామాటిపుర పోలీసులు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించి మంగళవారం అరెస్ట్ చేశారు. వీరి వద్దనుంచి 16.5 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు దక్షిణ మండలం డీసీపీ డాక్టర్‌ గజారావు భూపాల్‌ తెలిపారు.