మహిళల కడుపులో 3కిలోల బంగారం: కిడ్నాప్ చేసి దోచేశారు

మహిళల కడుపులో 3కిలోల బంగారం: కిడ్నాప్ చేసి దోచేశారు

Updated On : November 7, 2019 / 6:00 AM IST

యాక్షన్ సినిమాకి మించిపోయే క్రైమ్ సీన్ తమిళనాడులో జరిగింది. కడుపులో బంగారం ఉంచుకుని స్మగ్లింగ్ చేస్తున్న మహిళల నుంచి కూడా దోచేశారు. దాదాపు 3కిలోల వరకూ ఉన్న బంగారు ముద్దల్ని తీసుకుని ఉడాయించారు. చెన్నై పల్లావరం రహదారిలో జరిగిన ఘటన సంచలనం రేపింది. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తనిఖీ చేస్తున్న కస్టమ్స్ అధికారులకు ఇద్దరు మహిళలు అనుమానస్పదంగా కనిపించారు. 

గర్భం దాల్చినట్లుగా కనిపిస్తున్న వారిని సోదా చేసేసరికి కడుపులో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా తేలింది. శ్రీలంకకు చెందిన ఫాతిమా(32), త్రిష(36)లను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఆసుపత్రికి తరలించబోయారు. మార్గం మధ్యలో గుర్తు తెలియని 10మంది వ్యక్తులు దాడి చేశారు. మహిళలను కిడ్నాప్ చేసి చెంగల్పట్టులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

ఆ మహిళలకు ఎనీమా ఇచ్చి బంగారం దోచుకున్నారు. అనంతరం వారిని మీనంబాక్కం సమీపంలో విడిచిపెట్టి వెళ్లిపోయారు. పోలీసుస్టేషన్‌కు వెళ్లి కిడ్నాప్‌ గురయ్యామని ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో మంగళవారం చెన్నై విమానాశ్రయానికి రాత్రి దుబాయి నుంచి వచ్చిన విమానంలో 5.6 కిలోల 48 బంగారు కడ్డీలు దొరికాయి. టాయిలెట్‌ వెనుక దాచిన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ రూ.2.24 కోట్లని అధికారులు వెల్లడించారు.