Mumbai Cyber Crime: ఫేస్‌బుక్‌లో పరిచయమైంది.. ప్రేమగా మాట్లాడింది.. భారీ లాభాలు అంటూ 52లక్షలు దోచేసింది.. ముంబైలో హనీ ట్రాప్..
జపాన్‌లోని ఐబీఎం క్రిప్టో ట్రేడింగ్ విభాగంలో తాను చేరానని సుప్రిత ఆ వ్యాపారవేత్తకు చెప్పింది. తనపై బాగా నమ్మకం కలిగించుకున్న ఆమె.. లాభదాయకమైన రాబడిని హామీ ఇస్తూ, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహించింది.

Mumbai Cyber Crime: ముంబైలోని పోవైకి చెందిన 65 ఏళ్ల వ్యాపారవేత్త ఫేస్‌బుక్ ఫ్రెండ్ గా ఉన్న ఒక మహిళ చేతిలో మోసపోయాడు. ఏకంగా రూ.52 లక్షలు పోగొట్టుకున్నాడు. వెస్ట్ రీజియన్ సైబర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఈ కేసుని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయగా.. హనీట్రాప్ గా తేలింది. ప్రేమ, భారీ లాభాల పేరుతో సైబర్ నేరగాళ్లు వృద్ధుడిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సైబర్ మోసానికి అసలు కారణం..
జూన్‌లో ఫిర్యాదుదారునికి సుప్రిత శర్మ అనే మహిళ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తాను హాంకాంగ్‌లోని ఐబీఎంలో సీనియర్ పదవిలో ఉన్నట్లు ఆమె తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పేర్కొంది. బాధితుడు ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ ను అంగీకరించాడు. ఆ తర్వాత, సుప్రిత మెసెంజర్ ద్వారా స్నేహపూర్వక సంభాషణను ప్రారంభించింది. క్రమంగా అతని నమ్మకాన్ని పొందింది. ఆ తర్వాత ఫోన్ లో మాట్లాడుకునే వారు. అతని విశ్వాసాన్ని పొందడానికి ముద్దుగా మాట్లాడేది.
జపాన్‌లోని ఐబీఎం క్రిప్టో ట్రేడింగ్ విభాగంలో తాను చేరానని సుప్రిత ఆ వ్యాపారవేత్తకు చెప్పింది. తనపై బాగా నమ్మకం కలిగించుకున్న ఆమె.. లాభదాయకమైన రాబడిని హామీ ఇస్తూ, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహించింది. అయితే ఆమె మాటలను అతడు తొలుత నమ్మలేదు. పెట్టుబడి పెట్టేందుకు సంకోచించాడు. ఆమె ప్రేమతో మాట్లాడేసరికి అతడు అట్రాక్ట్ అయ్యాడు.
ఆ తర్వాత ఆమె క్రిప్టో ట్రేడింగ్ వెబ్‌సైట్ లింక్‌ను అతడికి షేర్ చేసింది. అక్కడ అతను ఖాతాను సృష్టించాడు. జూన్, జూలై 17 మధ్య, అతను రూ. 52 లక్షలు బదిలీ చేశాడు. వెబ్‌సైట్ డాష్‌బోర్డ్ లో చూడగా.. అతని సంపాదన రూ. 1.03 కోట్లకు పైగా పెరిగిందని చూపించింది. ఆమె చెప్పినట్లే భారీగా లాభం వచ్చిందని ఆ వ్యాపారవేత్త మురిసిపోయాడు. ఆ తర్వాత మరింత పెట్టుబడి పెట్టాలని అతడిపై ఒత్తిడి తెచ్చింది సుప్రిత.
అందుకు ఆ వ్యాపారవేత్త ఒప్పుకోలేదు. తనకు ఆర్థిక పరిమితులు ఉన్నాయని చెప్పాడు. అంతేకాదు తన ఆదాయాన్ని విత్ డ్రా చేసుకుంటానని రిక్వెస్ట్ చేశాడు. అయితే, మొదట లాభం మొత్తంలో 30 శాతం పన్నుగా చెల్లించమని సుప్రిత చెప్పింది. దీంతో బాధితుడు విస్తుపోయాడు. వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమన్నాడు.
అతను వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930)ను సంప్రదించాడు. తర్వాత వెస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం, 66C 66Dలోని సంబంధిత సెక్షన్లు BNS సెక్షన్లు 318(4), 319(2), 336(2), 336(3), 338, 340(2), మరియు 61(2)తో సహా ఇండియన్ పీనల్ కోడ్ నిబంధనల కింద కేసు నమోదు చేశారు.
ఇది హనీ ట్రాప్ అని పోలీసులు తేల్చారు. భారీ లాభాల ఆశ చూపి చీట్ చేశారని గుర్తించారు. బిట్ కాయిన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్ మెంట్, భారీ రాబడి.. అంతా ఫేక్ అని చెప్పారు. ఇలాంటి సైబర్ క్రైమ్స్ తో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు మంచిది కాదన్నారు. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దని హెచ్చరించారు. ఏదైనా అనుమానాస్పదం అనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.