తన వల్ల కుటుంబానికి కరోనా సోకుతుందనే భయంతో ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య
కరోనా భయం ప్రాణాలు తీస్తోంది. కరోనా సోకిందేమో అనే అనుమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

కరోనా భయం ప్రాణాలు తీస్తోంది. కరోనా సోకిందేమో అనే అనుమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
కరోనా భయం ప్రాణాలు తీస్తోంది. కరోనా సోకిందేమో అనే అనుమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు జరిగాయి. తాజాగా ఓ ఐఆర్ఎస్ అధికారి తనకు కరోనా సోకిందేమో అనే అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన పేరు శివరాజ్ సింగ్. వయసు 56 సంవత్సరాలు. ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో తన కారులో సూసైడ్ చేసుకున్నారు. శివరాజ్ 2006 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. ఢిల్లీలో ఆదాయపు పన్ను విభాగంలో అడిషనల్ కమిషనర్ గా పని చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో కరోనా సోకిందేమో అనే భయం పట్టుకుంది. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. అయినా ఆయనలో భయం మాత్రం పోలేదు. తన వల్ల తన కుటుంసభ్యులకు కరోనా వైరస్ సోకుతుందేమోనని ఆందోళన చెందారు. నిద్ర లేని రాత్రులు గడిపారు. చివరకు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు.
నా వల్ల కుటుంబసభ్యులకు కరోనా రాకూడదు:
తన వల్ల తన కుటుంబానికి కరోనా సోకకూడదని, వారు కరోనాతో బాధలు పడకూడదని నిర్ణయించిన శివరాజ్ ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. తన కారులో యాసిడ్ లాంటి ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్నారాయన. కారులో పోలీసులు సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నారు. ”నాకు కరోనా సోకిందేమో అనే అనుమానం ఉంది. నా వల్ల నా కుటుంబసభ్యులకు కరోనా సోకుతుందనే భయం వెంటాడుతోంది. నా వల్ల వారికి కరోనా రాకూడదు. నా వల్ల వారు ఇబ్బందులు పడకూడదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా” అని సూసైడ్ నోటులో రాసి ఉందని పోలీసులు తెలిపారు.
కారులో సూసైడ్ నోట్ లభ్యం:
కారులో ఓ వ్యక్తి స్పృహ కోల్పోయి పడి ఉన్నాడని పోలీసులకు ఫోన్ వచ్చింది. వెంటనే స్పాట్ కి చేరుకున్న పోలీసులు కారు డోర్లు తెరిచి కారులో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత ఐడీ కార్డు ఆధారంగా ఆయనను ఐఆర్ఎస్ అధికారి శివరాజ్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మృతి వెనుక అసలు కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి సూసైడ్ నోట్ ఆధారంగా ఆత్మహత్యగా ప్రాథమికంగా పోలీసులు తేల్చారు.
ప్రాణాలు తీస్తున్న కరోనా భయం:
కరోనా సోకిందేమో అనే అనుమానంతో ఐఆర్ఎస్ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. కరోనా నెగిటివ్ అని రిపోర్టులో వచ్చినా ఆయనీ నిర్ణయం తీసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. బాగా చదుకున్న వాళ్లు సైతం ఇలాంటి అనుమానాలు, అపోహలతో ఆత్మహత్యలు చేసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. కరోనా ప్రాణాంతం కాదు. సరైన సమయంలో గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని ప్రభుత్వాలు, డాక్టర్లు చెబుతున్నారు. కరోనా గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అయినా ఐఆర్ఎస్ స్థాయి అధికారి కరోనా భయాలతో చనిపోవడం అందరిని షాక్ కి గురి చేసింది.