Dharmasthala Mass Burials: నిజంగా ధర్మస్థలలో మర్డర్లు జరిగాయా? మహిళలు, బాలికలపై లైంగిక దాడి చేసి చంపేశారా? ఆ వ్యక్తి ఆరోపణల్లో వాస్తవమెంత..

తన ప్రాణాలకు హాని ఉందని ఆ వ్యక్తి వాపోయాడు. దీనిపై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Dharmasthala Mass Burials: నిజంగా ధర్మస్థలలో మర్డర్లు జరిగాయా? మహిళలు, బాలికలపై లైంగిక దాడి చేసి చంపేశారా? ఆ వ్యక్తి ఆరోపణల్లో వాస్తవమెంత..

Updated On : July 21, 2025 / 1:59 AM IST

Dharmasthala Mass Burials: కర్నాటకలో సంచలన రేపిన ధర్మస్థల సిరీస్ ఆఫ్ మర్డర్స్ ఆరోపణలు నిజమేనా? 20ఏళ్ల క్రితం అక్కడ కొన్ని ఘాతుకాలు జరిగాయా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సౌత్ కర్నాటకలో కలకలం రేపుతున్నాయి. అప్పట్లో కొన్ని హత్యలు జరిగాయని, తానే స్వయంగా ఆ డెడ్ బాడీలను పూడ్చి పెట్టానంటూ ఓ వ్యక్తి చేసిన ఆరోపణలతో కలకలం మొదలైంది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాఫ్తు చేయించాలంటూ ఆందోళనలు తారస్థాయికి చేరాయి.

మూడు రోజులుగా తీవ్రమైన సంచలనం కలిగిస్తున్న ధర్మస్థల సీక్రెట్ బరియల్స్ ఎపిసోడ్ పై ప్రభుత్వం ఓ ప్రాథమిక దర్యాఫ్తు కోసం ఆదేశించింది. అసలు సిట్ ఏర్పాటు చేయాలా వద్దా అనేది తెలుసుకునేందుకే ఈ ప్రాథమిక విచారణను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అసలక్కడ ఏం జరిగింది? ఆ వివరాల్లోకి వెళితే..

జూలై 3న ఓ వ్యక్తి ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో ఓ ఫిర్యాదు చేశాడు. 15ఏళ్ల క్రితం తాను కొన్ని శవాలను పాతిపెట్టానని చెప్పాడు. పాపభీతి వెంటాడటంతో తానిప్పుడు ఇలా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల మంజునాధుడు కొలువుదీరిన ఆలయం. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ప్రాంతం. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి కూడా ఇక్కడే శానిటేషన్ వర్కర్ గా పని చేశాడు. తాను 20 ఏళ్ల పాటు ఇలా అనేకమంది మృతదేహాలను పాటి పెట్టానని, వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరిపై లైంగిక దాడి జరిగినట్లుగా, మరికొందరిపై యాసిడ్ దాడులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని చెప్పాడు. దీంతో కర్నాటకలో తీవ్ర దుమారం రేగింది. అసలు ఇందులో నిజం ఎంతో తేల్చాలంటే సిట్ ఏర్పాటు చేయాలని మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

తన ప్రాణాలకు హాని ఉందని ఆ వ్యక్తి వాపోయాడు. దీనిపై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్మస్థలలో 1995-2014 మధ్య కాలంలో తాను పని చేశానని, మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి ఒడ్డున పూడ్చి పెట్టానని తెలిపారు. 2010లో స్కూల్ డ్రెస్ లో ఉన్న బాలిక శవాన్ని మరో చోట పాతిపెట్టినట్లు చెప్పాడు. ఇలా అనేక మృతదేహాలను తానే పూడ్చానని తెలిపాడు. కొన్నింటిని కాల్చేసినట్లు వెల్లడించాడు.

జూలై 11న బెళ్తంగడి కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చాడా వ్యక్తి. అంతేకాదు తాను చెబుతున్న దానికి సంబంధించిన ప్రదేశంలో ఓ అస్తి పంజరాన్ని కూడా ఆధారంగా చూపాడన్న ప్రచారం మొదలైంది. దీంతో పాటు అప్పట్లో ఆ హత్యలు ఎవరు చేసిందో కూడా అతడు కోర్టులో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ అంశాలతో ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్ ఏఐ సాయంతో చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గ మారింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే 2003 నాటి ఓ మిస్సింగ్ కేసుకు సంబంధించిన దర్యాఫ్తును తిరగదోడాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. 2003లో తన ఫ్రెండ్స్ తో కలిసి ధర్మస్థలకు వెళ్లిన తన కూతురు అనన్య భట్ ఈ మృతదేహాల్లో ఉందేమో చూడాలంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే 2012లో హత్యాచారానికి గురైన సౌజన్య అనే మరో విద్యార్థి కేసును కూడా తిరగదోడాలనే డిమాండ్ ప్రారంభమైంది. మొత్తంగా ధర్మస్థలలో తాజాగా పరిణామాలు పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫిర్యాదు చేసిన మాజీ శానిటేషన్ వర్కర్ చెప్పినదాంట్లో నిజం ఎంత అనేది తేల్చే పనిలో ఉన్నారు మంగళూరు పోలీసులు.