అక్రమ మద్యం రవాణా కేసులో ఎంబీఏ విద్యార్థి అరెస్టు…రోజుకు రూ.9లక్షల మద్యం అమ్మకం

అక్రమ మద్యం రవాణా కేసులో ఎంబీఏ విద్యార్థి అరెస్టు…రోజుకు రూ.9లక్షల మద్యం అమ్మకం

Updated On : January 17, 2021 / 9:27 PM IST

dry Bihar, Police arrest MBA bootlegger whose sales topped 9 lakh per day : బీహార్ రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ మద్యం ఏరులై పారుతోంది. అధికారుల కళ్లు కప్పి అక్రమార్కులు తెగ సంపాదిస్తున్నారు. ఎంబీఏ చదివిన విద్యార్ధి ఏకంగా రోజుకు రూ.9లక్షల విలువ చేసే మద్యాన్ని అమ్ముతూ పోలీసులకు దొరికి పోయాడు. మద్యం స్మగ్లింగ్ లో సహకరిస్తున్నవ్యక్తులు ఇచ్చిన ఆధారాలతో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
patna liquor
పాట్నాకు చెందిన అతుల్ సింగ్ అనే యువకుడు ప్రయివేట్ గా ఎంబీఏ చదువుతూ పౌల్ట్రీ వ్యాపారం నిర్వహించేవాడు. ఇటీవల పౌల్ట్రీ రంగంలో బాగా నష్టం రావటంతో సులువుగా డబ్బులు సంపాదించాలని  ఆలోచించాడు. అక్రమంగా మద్యం అమ్ముదామని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా పక్క రాష్ట్రాలనుంచి మద్యం తెప్పించి స్ధానికంగా అమ్మటం మొదలెట్టాడు.
patna liquor 2
దానిద్వారా వచ్చిన డబ్బులతో విలాసవంతంగా జీవించటం మొదలెట్టాడు. లగ్జరీకారు, ఐ ఫోన్లు వాడకం మొదలెట్టాడు. రూ, 8లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ బైక్ కొన్నాడు. మద్యం సరఫరా కోసం 30-40 మందిని డెలివరీ ఏజెంట్లుగా పెట్టుకున్నాడు. వారణాశి నుంచి నలుగురు స్మగ్లర్లు అతుల్ సింగ్ కు మద్యం సరఫరా చేస్తున్నారు.
patna liquor 3
అతుల్ కు స్మగ్లింగ్ లో సహకరిస్తున్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన పక్కా సమాచారం తో శుక్రవారం రాత్రి పోలీసులు అతుల్ ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేశారు. దాడిలో రూ.21లక్షల విలువైన 1100 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. ఓ డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు.

డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం.. పాట్నాలోని పలు ప్రాంతాల్లో కలిపి అతుల్‌ రోజూ రూ. 9 లక్షలు విలువ చేసే మద్యం విక్రయిస్తున్నాడని గుర్తించారు. కాగా వారణాశి నుంచి అతుల్ కు మద్యం స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు స్మగ్లర్లను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
patna liquor 4