Loan App Harassment : ప్రాణం తీసిన లోన్ యాప్.. వేధింపుల తట్టుకోలేక నంద్యాలలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

లోన్ యాప్స్.. ప్రజల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. రుణాలు ఇచ్చి ప్రాణాలు తీస్తున్నాయి. వడ్డీకి చక్ర వడ్డీ వేసి తీసుకున్న అప్పు కంటే రెట్టింపు మొత్తాన్ని వసూలు చేస్తూ మనుషుల ప్రాణాలను పీక్కుతింటున్నారు.

Loan App Harassment : ప్రాణం తీసిన లోన్ యాప్.. వేధింపుల తట్టుకోలేక నంద్యాలలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Updated On : September 17, 2022 / 7:34 PM IST

Loan App Harassment : లోన్ యాప్స్.. ప్రజల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. రుణాలు ఇచ్చి ప్రాణాలు తీస్తున్నాయి. వడ్డీకి చక్ర వడ్డీ వేసి తీసుకున్న అప్పు కంటే రెట్టింపు మొత్తాన్ని వసూలు చేస్తూ మనుషుల ప్రాణాలను పీక్కుతింటున్నారు. పొరపాటున అప్పు చెల్లించడంలో ఆలస్యమైందా ఇక అంతే.. లోన్‌ తీసుకున్న వారి కుటుంబసభ్యులు, స్నేహితులకు మార్ఫింగ్‌ ఫొటోలు, అసభ్యకరమైన సందేశాలు పంపి టార్చర్‌ పెడతారు. బ్లాక్ మెయిల్ కు దిగారు. ఈ టార్చర్‌ భరించలేక ఆత్మహత్య చేసుకున్న వారు ఎందరో. తాజాగా ఏపీలోని నంద్యాలలో అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది.

లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక వీరేంద్ర అనే బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాలలోని బాలాజి కాంప్లెక్స్‌లో నివాసం ఉండే వీరేంద్ర.. బెంగళూరులో ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. ఇటీవల ఓ యాప్‌ నుంచి లోన్‌ తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో ఆలస్యం కావడంతో నిర్వాహకులు టార్చర్ పెట్టడం ప్రారంభించారు.

తీసుకున్న అప్పు చెల్లించాలి అంటూ వీరేంద్ర బంధువులు, ఫ్రెండ్స్ కు యాప్ నుంచి ఫోన్ కాల్స్ చేశారు. అంతటితో ఆగకుండా వీరేంద్ర ఫొటోను మార్ఫింగ్ చేశారు. ‘ఈ వ్యక్తి మా సంస్థలో లోన్‌ తీసుకొని చెల్లించలేదు. మీ నెంబర్‌ను రెఫరెన్స్‌గా ఇచ్చాడు. ఇప్పుడు మీరు లోన్‌ను చెల్లించాలి. లేదంటే మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తాము’ అంటూ వీరేంద్ర స్నేహితులకు మెసేజ్‌లు పంపారు. దీంతో అవమానంగా భావించిన వీరేంద్ర.. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

లోన్ యాప్‌ నిర్వాహకుల వేధింపుల కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, ఆన్ లైన్ లోన్ యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లోన్ యాప్ దారుణాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోన్ యాప్స్ జోలికి వెళ్లొద్దని చెబుతున్నారు. అయినా, ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. లోన్ యాప్స్ జోలికెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.

ఎలాంటి పేపర్ వర్క్‌ లేకపోవడం, సిబిల్‌ స్కోర్‌ అవసరం ఉండకపోవడం, అసలు ఫిజికల్‌గా అటెండ్ కావాల్సిన అవసరమే లేదు.. జస్ట్ స్మార్ట్‌ఫోన్‌లో ఓ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు నిమిషాల వ్యవధిలో అకౌంట్‌లోకి డబ్బు వచ్చి పడుతుంది. దీంతో ఇంకా కొందరు వ్యక్తులు తమ ఆర్థిక అవసరాల కోసం లోన్ యాప్ లను ఆశ్రయిస్తున్నారు. ఆ తర్వాత వేధింపులు, బ్లాక్ మెయిల్ తట్టుకోలేక బలవనర్మణాలకు పాల్పడుతున్నారు.