జాతకం చూసుకోలేదా సారూ : జ్యోతిష్యుడి ఆఫీసులో నకిలీ సీబీఐ దాడులు, బంగారం చోరీ

  • Published By: veegamteam ,Published On : September 24, 2019 / 07:05 AM IST
జాతకం చూసుకోలేదా సారూ : జ్యోతిష్యుడి ఆఫీసులో నకిలీ సీబీఐ దాడులు, బంగారం చోరీ

Updated On : September 24, 2019 / 7:05 AM IST

భవిష్యత్ చెప్పే జోతిష్యుడినే బురిడీ కొట్టించారు. తన విద్యతో ఎందరికో సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయనే మోసపోయారు. We are from CBI అంటూ సినిమా స్టయిల్లో రైడింగ్‌ చేసి కావాలసినవన్నీ పట్టుకుపోయారు. నిత్యం జనాలతో కిటకిటలాడే అమీర్‌పేట్‌లో సీబీఐ దాడి అంటూ నాటకమాడి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. హైదరాబాద్ సిటీ మధ్యలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌ అమీర్‌పేటలో జగదీశ్ అనే జ్యోతిష్యుడు ఉన్నారు. మెత్రీవనంలోని అన్నపూర్ణ బ్లాక్ ఐదో అంతస్తులో జ్యోతిష్యం ఆఫీసు. కొన్ని సంవత్సరాలుగా జ్యోతిష్యం ఆఫీస్ నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం ఉదయం ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆఫీసులోకి వచ్చారు. సీబీఐ అధికారులం అని లోపలికి దూసుకొచ్చారు. తలుపులు మూసివేశారు. ఆఫీస్ లోని అందరి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు చూపించాలని హడావిడి చేశారు. 

ఆస్తుల వివరాలు, నగల వివరాలు అని కాసేపటి వరకూ గందరగోళం సృష్టించారు. ఒంటిపై ఉన్న బంగారంతోపాటు ఆఫీసులో ఉన్న మొత్తం 25తులాల బంగారం తీసుకున్నారు. వచ్చినోళ్లపై అనుమానం వస్తున్నా బయట వ్యక్తులకు ఫోన్‌ చేయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఆఫీసులోని వారంతా చూస్తుండిపోయారు. ఆఫీసుకు వచ్చి లెక్కలు చూపించి.. బంగారం తీసుకెళ్లాలంటూ హడావిడిగా వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన తర్వాత పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి ఎస్సార్ నగర్ పోలీసులు వచ్చారు. 

వివరాలు సేకరించి, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకుంటామని వెల్లడించారు. జ్యోతిష్యం నిర్వహించే ఆఫీసులో బంగారం ఉందన్న పక్కా సమాచారంతో నకిలీ సీబీఐ అధికారుల పేరుతో దాడి చేశారని అనుమానిస్తున్నారు పోలీసులు.