టీఎంసీ ఎమ్మెల్యే హత్య : బీజేపీ నేతపై ఎఫ్ఐఆర్ నమోదు

పశ్చిమ బెంగాల్ : తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ ప్రారంభించిన రాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో బీజేపీ నేత ముకుల్ రాయ్‌తో పాటు మరో ముగ్గురు పేర్లను చేర్చడం గమనార్హం ‘‘ ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నాం. హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. దుండగులు వెనక నుంచి కాల్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇది కచ్చితంగా పథకం ప్రకారమే చేసిన పని’’ అని ఎస్పీ రుపేష్ కుమార్ తెలిపారు. గతంలో టీఎంసీలో ఉన్న ముకుల్ రాయ్ మన్మోహన్ సింగ్ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం టీఎంసీతో వచ్చిన విభేదాల వల్ల బీజేపీలో చేరారు.
నదియా జిల్లా కృష్ణగంజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సత్యజిత్ శనివారం జరిగిన ఓ సరస్వతి పూజలో టీఎంసీ జిల్లా అధ్యక్షుడు గౌరీ శంకర్ దత్తాతో కలిసి పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చడంతో సత్యజిత్ అక్కడికక్కడే మృతిచెందినట్లు గౌరీశంకర్ తెలిపారు. అయితే సీబీఐ వివాదంలో టీఎంసీ, బీజేపీకి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. హత్య వెనక బీజేపీ హస్తం ఉందని టీఎంసీ ఆరోపిస్తోంది. మరోవైపు టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండించింది.