హైదరాబాద్ కోఠిలో భారీ అగ్ని ప్రమాదం

fire accident in koti, hyderabad : హైదరాబాద్ కోఠీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం అర్దరాత్రి సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అగ్నిప్రమాదంలో నాలుగు బట్టల షాపులు పూర్తిగా దగ్దం అయ్యాయి. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కోఠి ఆంధ్రా బ్యాంకు సెంటర్ వద్ద ఉన్న ఒక దుకాణంలో చెలరేగిన మంటలు క్రమేపి ఇతర షాపులకు వ్యాపించాయి.
బట్టల షాపులు మూసేసి యజమానులు ఇళ్లకు వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో షాపుల్లో ఎవరూ లేకపోవటంతో ప్రాణనష్టం తప్పింది. దుకాణాల్లోని బట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాయానికి నాలుగు అగ్నిమాపక శకటాలు ఘటనా స్ధలానికి వచ్చి మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా నిరోధించగలిగాయి.
ప్రమాదం వార్త తెలిసిన షాపుల యజమానులు షాపుల వద్దకు వచ్చి… అగ్నికి ఆహుతవుతున్న షాపులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఒకానోక దశలో షాపుల్లోకి వెళ్లి మిగిలిన స్టాకును బయటకు తెచ్చుకుందామని ప్రయత్నించినా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారిని వారించారు.
40 ఏళ్లుగా బట్టల కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని, అగ్ని ప్రమాదం వల్ల అన్నీ కొల్పోయి రోడ్డున పడ్డామని వ్యాపారస్తులు వాపోయారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా, మరేదైనా కారణమా అని పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.