ములుగు లో భారీ అగ్నిప్రమాదం

వరంగల్ : వరంగల్ జిల్లా ములుగులోని కోస్టల్ కనస్ట్ర క్షన్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో టైర్లు, టిప్పర్లు, ఇతర వాహనాలు కాలి బూడిదయ్యాయి. భారీ ఎత్తున పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాధమికంగా అందిన సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండి పోతున్నాయి. కోస్టల్ ప్రాజెక్టు కంపెనీ వద్ద గల వరిపొలాల్లో గడ్డి తగలబెట్టటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు మరో కధనం చెపుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది విచారణ జరిపితేనే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి.
దేవాదుల ప్రాజెక్టు 3వ ఫేజ్ కు సంబంధించిన పనులను కోస్టల్ కనస్ట్ర క్షన్ కంపెనీ ఇక్కడి నుంచే తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ప్రాజెక్టుకు అవసరమైన భారీయంత్రాలు, కంపెనీకి చెందిన వాహనాలు, రిపేరుకు వచ్చిన టిప్పర్లను ఇక్కడ పార్క్ చేసి ఉంచుతారు. రిపేరుకు వచ్చిన టిప్పర్ టైర్లకు నిప్పంటుకుని ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉవ్వెత్తున మంటలు ఎగిసి పడటంతో మంటలను అదుపులోకి తీసుకురావటం కొంచెం కష్టం అయ్యింది. దాదాపు 2 గంటల పాటు శ్రమించి అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.