ఇన్ స్టాగ్రాంలో ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వల 

  • Published By: murthy ,Published On : June 28, 2020 / 03:15 PM IST
ఇన్ స్టాగ్రాంలో ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వల 

Updated On : June 28, 2020 / 3:15 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా  పిల్లలు, పెద్దలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సడలింపులు ఇచ్చినప్పటి నుంచి ఉద్యోగాలకు వెళుతున్నారు కొందరు….మరి కొందరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అలాగే పిల్లలకు ఆన్ లైన్ క్లాస్ లు స్టార్ట్ చేశాయి కొన్నివిద్యా సంస్ధలు.

ఆన్ లైన్ క్లాసుల కోసం కంప్యూటర్ ముందు కూర్చున్న పిల్లలు ఇంటర్నెట్ కు కుడా బాగానే అలవాటు పడ్డారు. అప్పటికే స్మార్ట్ ఫోన్ల వాడకంలో అలవాటు పడిన పిల్లలు డెస్క్ టాప్, లాప్ టాప్ లలోనూ తేలికగా ఇంటర్నెట్ అలవాటు  పడిపోయారు. దీంతో సోషల్ మీడియాకు సంబంధించిన అన్ని ప్లాట్ ఫాంలకు పిల్లలు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇన్ స్టాగ్రాం కు అలవాటు పడిన ఒక  మైనర్ బాలిక ఒక మాయగాడి వలలో పడి మోస పోయింది.  బాలిక తండ్రి  అలెర్టవటంతో క్షేమంగా బయటపడింది.

బెంగుళూరు  ఉత్తర హళ్లిలోని ఏజీఎస్ లేఔట్ లో ఉన్న ప్రైవేట్ స్కూలులో 8వ తరగతి చదివే  మైనర్ బాలికకు ఆన్ లైన్ లో క్లాస్ లు మొదలెట్టారు. ఈ క్రమంలో బాలిక క్లాస్ పాఠాలతో పాటు విరామ సమయంలో సోషల్ మీడియాకు బాగా అలవాటు పడింది.  ఇన్ స్టాగ్రాం లో ఎక్కువ సేపు గడుపుతూ  తన వ్యక్తిగత ఫోటోలను ఎప్పటి కప్పుడూ అప్ డేట్ చేస్తూ ఉండేది.

ఈ క్రమంలో ఆమెకు హైదరాబాద్ కు చెందిన  విశాల్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. నిన్ను వదిలి నేనుండలేను అనేంతగా వారిద్దరూ ఘాడంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలికను హైదరాబాద్ వచ్చేయమని విశాల్ కోరాడు.  దీంతో బాలిక జూన్ 8వ తేదీన మ్యూజిక్ క్లాస్ కు వెళ్లోస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయలు దేరింది. హైదరాబాద్  వెళ్లటానికి నేరుగా కెంపె గౌడ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అక్కడ విమానం కోసం వెయిట్ చేస్తోంది.

గత కొన్నిరోజుల  నుంచి కూతురు ప్రవర్తన గమనిస్తున్న తండ్రి, మ్యూజిక్ క్లాస్కు వెళ్ళిన కూతురు, క్లాస్ టైమ్ అయిపోయినా  తిరిగి ఇంటికి రాకపోయేసరికి, మ్యూజిక్ క్లాస్లో వాకబు చేశారు. అక్కడ లేదని తెలిసే సరికి వెంటనే ఆమె ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ డీ కోడ్ చేసి చాటింగ్ హిస్టరీ చూశాడు.

చాటింగ్ లో… బాలిక హైదరాబాద్  రావడానికి విశాల్ విమానం టికెట్ బుక్ చేసిన సంగతి  తెలుసుకున్నాడు. వెంటనే ఎయిర్ పోర్టుకు బయలుదేరి వెళ్లి అక్కడ విమానం కోసం ఎదురు చూస్తున్నకుమార్తెను ఇంటికి తీసుకువచ్చాడు. జూన్ 17 న సైబర్ క్రైంపోలీసులకు విశాల్ మీద ఫిర్యాదు చేశాడు.

హైదరాబాద్ కు చెందిన విశాల్  బాలికకు18 సంవత్సరాలు అని నమ్మించటానికి నకిలీ SSLC మార్క్స్  కార్డ్  తయారు చేయించాడు.  వస్తూ వస్తూ  ఫోటోలు, ఆధార్ కార్డు కొంత నగదు తీసుకురమ్మని  చెప్పటంతో బాలిక అలాగే చేసింది. విశాల్ కు సంబంధించిన ఆధారాలు పోలీసులకు ఇంకా లభ్యం కాలేదు. అతడిపై సైబర్ క్రైం, పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 468 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read: వీళ్లు పోలీసులేనా : బాలికపై లైంగిక దాడి..గర్భస్రావం