Ranga Reddy Incident: తమ్ముడి ప్రేమకు అన్న బలి.. హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి.. రంగారెడ్డి జిల్లాలో ఘోరం..
కిడ్నాప్ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినా.. పోలీసులు పట్టించుకోలేదని రాజశేఖర్ తల్లిదండ్రులు ఆరోపించారు.
Ranga Reddy Incident: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కులాంతర వివాహం చిచ్చు రేపింది. తమ్ముడి ప్రేమకు అన్న బలయ్యాడు. ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన భవాని, చంద్రశేఖర్ వివాహానికి చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ సహకరించినట్లు యువతి బంధువులు కక్ష పెంచుకున్నారు. అమ్మాయిని తమ ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కోపంతో రగిలిపోయారు. రాజశేఖర్ ను కిడ్నాప్ చేసి గ్రామ శివారులోకి తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. కిడ్నాప్ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినా.. పోలీసులు పట్టించుకోలేదని రాజశేఖర్ తల్లిదండ్రులు ఆరోపించారు.
ఎల్లంపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ కూతురు భవాని(18), అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (25) ప్రేమించుకున్నారు. భవాని డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. చంద్రశేఖర్ ఆటో డ్రైవర్. నెల రోజుల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు.
వేర్వేరు కులాలు కావడంతో.. భవాని కుటుంబసభ్యులు వారి పెళ్లిని అంగీకరించలేదు. దీనిపై షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమక్షంలో అమ్మాయి, అబ్బాయి వేర్వేరుగా ఉండేలా పెద్దల మధ్య ఒప్పందం జరిగింది. ఇటీవల ఇద్దరూ కలిసి ఊరు నుంచి వెళ్లిపోయారు.
తమ కూతురు చంద్రశేఖర్ తో కలిసి వెళ్లిపోవడంతో భవాని తల్లిదండ్రులు కోపంతో రగిలిపోయారు. చంద్రశేఖర్, భవానిల వివాహానికి చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ సహకరించి ఉంటాడని వారు అనుమానించి అతడిపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో రాజశేఖర్‌ను భవాని కుటుంబసభ్యులు కిడ్నాప్ చేశారు. గ్రామ శివారులోకి తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు.
