Revanth Reddy : ఏ ఒక్కటీ చేజారొద్దు.. మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల ఎన్నికపై పార్టీ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
Revanth Reddy : సోమవారం చైర్మన్, మేయర్ల ఎన్నిక ఉండటంతో పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై దిశానిర్దేశం చేశారు.
Revanth Reddy
- 16న మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక
- హంగ్ మున్సిపాలిటీల్లో పాగావేయాలి
- పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్
Revanth Reddy : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గణనీయమైన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డులు, కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక డివిజన్లను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే, కొన్ని మున్సిపాలిటీల్లో హంగ్ రావడంతో ఆ మున్సిపాలిటీల్లోనూ పాగావేయాలని కాంగ్రెస్ అధిష్టానం పట్టుదలతో ఉంది. 16న (సోమవారం) చైర్మన్, మేయర్ల ఎన్నిక ఉండటంతో ఆదివారం రాత్రి పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో 66 చైర్మన్ పీఠాలను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ మూడు పీఠాలను గెలుచుకుంది. మరో మూడు చోట్ల హంగ్ ఏర్పడింది. మున్సిపాలిటీల్లో 30కిపైగా స్థానాల్లో హంగ్ ఏర్పడింది. దీంతో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు.
మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. సోమవారం జరిగే చైర్మన్లు, మేయర్ల ఎన్నిక సందర్భంగా వ్యవహరించాల్సిన వ్యూహంపై నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.
హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని దక్కనున్నాయో పార్లమెంట్ ఇన్ఛార్జిలను వివరాలు అడిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థల్లో మేయర్ల ఎన్నికపై ఇన్ఛార్జిలు వ్యవహరించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. సామాజిక సమతుల్యత పాటించాలని సూచించారు. హంగ్ మున్సిపాలిటీల విషయంలో ఏ ఒక్కటి కూడా చేజారకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు.
