Jigisha Ghosh: ఐదు నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పింది.. కానీ
14 ఏళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన IT ఎగ్జిక్యూటివ్ జిగిషా ఘోష్ హత్య కేసు మరోసారి వార్తల్లో నిలిచింది.

Jigisha Ghosh mother Sabita Ghosh recalled painful day after Soumya Vishwanathan case verdict
Soumya Vishwanathan case verdict: “5 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తా. నేను వచ్చేసరికి బ్రేక్ ఫాస్ట్ రెడీ ఉంచు” అదే ఆమె చివరి ఫోన్ కాల్. కానీ ఆమె ఇంటికి చేరలేదు. ఇంటికి అత్యంత సమీపంలోనే అనూహ్యంగా హత్యకు గురైంది. జిగిషా ఘోష్ అనే యువతి దేశ రాజధానిలో ఢిల్లీలో 14 ఏళ్ల క్రితం హత్యకు గురైంది. హెడ్‌లైన్స్ టుడే జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో తీర్పు వెలువడిన నేపథ్యంలో జిగిషా తల్లి సబితా ఘోష్ బాధాకరమైన రోజును గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే జిగిషాను పొట్టనపెట్టుకున్న కిరాతుకులే సౌమ్యను చంపారు.
అసలేం జరిగింది?
IT ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న జిగిషా ఘోష్ 2009, మార్చిలో దారుణ హత్యకు గురయ్యారు. ఆఫీసులో పని ముగించుకుని తెల్లవారుజామున వసంత్ విహార్‌లోని తన ఇంటికి తిరిగొస్తుండగా దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి చంపేశారు. ఆమె వద్దనున్న బ్యాంకు కార్డులు, నగదు దోచుకున్నారు. ఫరీదాబాద్‌లోని సూరజ్ కుండ్ ప్రాంతంలో జిగిషా శవాన్ని పోలీసులు గుర్తించారు. మూడు రోజుల తర్వాత హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిగిషా నుంచి దొంగిలించిన డెబిట్ కార్డుతో షాపింగ్ చేయడంతో దుండగులు పోలీసులకు చిక్కారు.
సౌమ్య విశ్వనాథన్ కేసుతో లింకేంటి?
జిగిషా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు మొదట రవి కపూర్, అమిత్ శుక్లాను అరెస్ట్ చేశారు. తర్వాత బల్జిత్ మాలిక్, అజయ్ సేథిను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 2010, జూన్ లో చార్జిషీటు దాఖలు చేయగా.. నవంబర్ లో కోర్టు విచారణ ప్రారంభమైంది. విచారణ పూర్తైన తర్వాత రవి కపూర్, అమిత్ శుక్లాను ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. మాలిక్ కు జీవితఖైదు వేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా 2018లో మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.
జిగిషా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ ను వీరే హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. జిగిషా హత్యకు ఏడాది ముందు అంటే 2008, సెప్టెంబర్ 8న సాకెత్ విహార్ ప్రాంతంలో సౌమ్య అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. తన కారులో గాయాలతో శవమై కనిపించారు. పోలీసులు మొదట యాక్సిడెంట్ కేసు నమోదు చేశారు. అయితే జిగిషా హత్య కేసులో దుండగులను అరెస్ట్ చేశాక వారికి నిజం తెలిసింది. సౌమ్యను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్న విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. అయితే సాక్ష్యాలు సంపాదించడం పోలీసులకు సవాల్ మారింది. అందుకే ఈ కేసులో కోర్టు తీర్పు ఆలస్యమైందని జిగిషా తల్లి సబితా ఘోష్ తెలిపారు.
Also Read: 15 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ.. జర్నలిస్ట్ సౌమ్య హత్య కేసులో కీలక తీర్పు ఇచ్చిన కోర్టు
“నా కుమార్తె హత్య కేసులో అరెస్టుల వరకు సౌమ్య కేసులో ఎటువంటి ఆధారాలు లేవు. కానీ మా కేసులో సాక్ష్యాలను పోలీసులు వెంటనే సంపాదించారు. జిగిషా నుంచి దొంగిలించిన ఆభరణాలు అమ్ముకున్నారు. బ్యాంకు కార్డుతో హంతకులు కొనుగోలు చేసిన వస్తువులను పోలీసులు ట్రేస్ చేయగలిగారు. అప్పట్లో డెబిట్ కార్డుతో షాపింగ్ చేసిన తర్వాత బిల్లుపై సంతకం చేసేవారు. నా కుమార్తె అడ్డంగా సంతకం చేసేది. కానీ నిందితుడు రవి కపూర్ నిలువుగా సంతకం చేశాడు. జిగిషా హత్య, దోపిడీతో సంబంధం ఉందని చూపించేందుకు ఇటువంటి బలమైన సాక్ష్యాలు పోలీసులు సంపాదించార”ని సబితా ఘోష్ చెప్పారు.
Also Read: ఢిల్లీ పోలీస్ ఇన్స్పెక్టర్ను హత్య చేసిన ఆరిజ్ ఖాన్‌కు మరణ శిక్ష తప్పింది.. కోర్టు తీర్పు ఏంటంటే?
మరణశిక్ష పడాలని కోరుకున్నాం
సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులోనూ నిందితులను సాకేత్ కోర్టు దోషులుగా తేల్చడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సౌమ్య కుటుంబ సభ్యులకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. తమ కుమార్తె హత్య కేసులో హంతకులకు మరణశిక్ష పడాలని కోరుకున్నామని చెప్పారు. ఇప్పటికే సుదీర్ఘ కాలం పాటు న్యాయపోరాటం చేశామని, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నందున.. తమ కూతురి కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదని వివరించారు. కాగా, సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో అక్టోబర్ 26న దోషులకు శిక్ష ఖరారు కానుంది.