కోటా ఆస్పత్రిలో శిశు మరణాలు : మంత్రి వస్తున్నారని కార్పెట్ పరిచారు.. వెళ్లాక తీసేశారు!

  • Published By: sreehari ,Published On : January 3, 2020 / 12:56 PM IST
కోటా ఆస్పత్రిలో శిశు మరణాలు : మంత్రి వస్తున్నారని కార్పెట్ పరిచారు.. వెళ్లాక తీసేశారు!

Updated On : January 3, 2020 / 12:56 PM IST

రాజస్థాన్‌‌లోని కోట సిటీలోని జేకే లొన్ ప్రభుత్వ ఆస్పత్రిలో 100 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. డిసెంబర్ ఒకనెలలోనే దాదాపు వంద మంది వరకు శిశువులు మృతిచెందారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పసికందులు ప్రాణాలు కోల్పోయారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై కూడా దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై విమర్శలు రావడంతో స్పందించిన రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ హుటాహుటినా కోటాలోని జెకే లోన్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. మంత్రి గారు వస్తున్నారు అని చెప్పగానే ఆస్పత్రిలో నానా హంగామా సృష్టించారు. ఏదో మీటింగ్ కార్యక్రమానికి వెళ్తున్నట్టుగా ఏర్పాట్లు చేశారు. పరామర్శించేందుకు వెళ్తున్న మంత్రి రఘుకు గ్రీన్ కార్పెట్ తో స్వాగతం పలికారు. మంత్రిగారు వెళ్లిపోగానే వెంటనే వేసిన కార్పెట్ ను తొలగించినట్టు న్యూస్ ఏజెన్సీ నివేదించింది. 

డిసెంబర్ నెలలో కనీసం 100 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో పుట్టిన 10 మంది 48 గంటల్లోనే (డిసెంబర్ 23, డిసెంబర్ 24 తేదీల్లో) మృతిచెందారు. ఈ ఘటనపై స్పందించిన అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. గతనెలలో ఆస్పత్రిలోని లోపాలను అన్నింటిపై ప్రభుత్వం ఆరా తీసింది. చిన్నారుల మృతి ఘటనపై ఆస్పత్రికి చేరుకున్న జాతీయ మీడియా.. అక్కడి పేషంట్ల బంధువులను అడిగి వివరాలు సేకరించింది. ఆస్పత్రిలో సౌకర్యాలు అధ్వన్నంగా ఉన్నాయని, పేషంట్లకు ట్రీట్ మెంట్ చేయాలని పిలిచినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. 

మరోవైపు కేంద్ర బృందానికి చెందిన నిపుణులు ఆస్పత్రిని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. దీనిపై వివరణాత్మక రిపోర్టును తర్వాత సమర్పించనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈ బృందం సంయుక్తంగా విశ్లేషణ చేయనుంది. క్లినికల్ ప్రొటోకాల్స్, సర్వీసు డెలివరీ, సిబ్బంది తదితర అంశాలపై పర్యవేక్షించనుంది. ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో వందల సంఖ్యలో చిన్నారులు మృతిచెందడంపై రాజస్థాన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర సీఎంను సైతం తొలగించాలనే ఆరోపణలు తీవ్రతరమయ్యాయి.

బీఎస్పీ సుప్రిమో మాయావతి కూడా దీనిపై స్పందిస్తూ.. సీఎం అశోక్ గెహ్లాట్ ను వెంటనే తొలగించాలని ఆయన స్థానంలో కొత్త వారికి చోటు ఇవ్వాలని లేదంటే మరెందరో తల్లులు తమ బిడ్డలను కోల్పోవాల్సి వస్తుందని మాయావతి డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) కూడా ప్రభుత్వానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘ఆస్పత్రి ఆవరణలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి’ అని చైర్ పర్సన్ ప్రియాంక్ కనూంగో తెలిపారు. రాజస్థాన్ ప్రభుత్వ కమిటీ మాత్రం.. ఆస్పత్రిలో శిశువులకు సరైన చికిత్స అందించినట్టు పేర్కొంది.