నల్గొండలో tupperware పేరిట మహిళ మోసం

  • Published By: madhu ,Published On : September 20, 2020 / 03:14 PM IST
నల్గొండలో tupperware పేరిట మహిళ మోసం

Updated On : September 20, 2020 / 3:28 PM IST

tupperware : టప్పర్ వేర్ పేరిట 15 మందికి రూ. 4 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కిలేడీని నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికు మొర పెట్టుకోగా..ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లోతుగా విచారించాల్సిన అవసరం ఏర్పడడంతో ఈ కేసును టాస్క్ ఫోర్స్ కు అప్పగించారు. వివరాల్లోకి వెళితే…



నల్లగొండ పట్టణంలోని శివాజీనగర్‌ చెందిన ఆకుల స్వాతి టప్పర్‌ వేర్‌ వ్యాపారం నిర్వహిస్తోంది. రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.30వేల కమీషన్‌ వస్తుందంటూ ప్రచారం చేయసాగింది. స్థానికంగా ఉన్న మహిళలకు మాయమాటలు చెప్పింది.

దీంతో చాలా మంది ఆమె మాటలు నమ్మారు. పట్టణంలోని యాటకన్నారెడ్డి కాలనీకి చెందిన మానస రూ.కోటి 30 లక్షలు, అదే కాలనీకి చెందిన యాట భారతమ్మ రూ.19 లక్షలు పెట్టుబడిగా ఇచ్చింది. వారికి నమ్మించేందుకు రెండు నెలల పాటు కమిషన్ ఇచ్చింది. ఇది ఇతరులు గమనించారు.



పెట్టుబడులు పెట్టారు. అయితే..కమీషన్ ఇవ్వడం మానేసింది. దీంతో వారందరూ స్వాతిని నిలదీశారు. డబ్బులు ఇవ్వాల్సింది పోయి..ఎదురు తిరిగింది. డబ్బులు ఇచ్చిన సమయంలో ఏదైనా కాగితం రాసుకున్నామా అంటూ…నిలదీసింది. బెదిరించసాగింది.
దీంతో బాధితులంతా శనివారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి తెలియచేశారు. బాధితులతో కలిసి వచ్చి ఎస్పీకి రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. కేసును సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అప్పగించారు. ప్రాథమికంగా రూ.4కోట్ల వరకు కుచ్చుటోపీ పెట్టినట్లు ప్రత్యేక పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.



ప్రజలను మోసగించి తీసుకున్న డబ్బుతో కారు, ఇతర చోట్ల ఇంటి స్థలాలు కొనుగోలు, విలాసవంతమైన వస్తువులు కొన్నట్లు సమాచారం. కానీ..ఈమె దగ్గర ఎంతమంది డబ్బులు పెట్టుబడి పెట్టారు ? బాధితులు ఎంతమంది ? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.