“కుళ్లిపోయిన స్థితిలో పాకిస్థాన్ నటి మృతదేహం” కేసు.. ఆమె చివరి మెసేజ్ ఏంటో తెలుసా? వైరల్ అవుతోంది..
హుమైరా తన స్నేహితురాలు దురేషెహ్వర్‌కు పంపిన ఒక వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రముఖ పాకిస్థానీ నటి, మోడల్ హుమైరా అస్ఘర్ అలీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కరాచీలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనపడ్డారు. ఆ విషయం దాదాపు ఆరు నెలల పాటు బయటి ప్రపంచానికి తెలియకపోవడం అందరినీ కలచివేస్తోంది. పోలీసుల దర్యాప్తులో ఈ విషాదానికి సంబంధించిన అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విషాదం వెలుగులోకి వచ్చింది ఇలా..
ఈ వారం హుమైరా అస్ఘర్ మృతదేహాన్ని ఆమె నివసిస్తున్న కరాచీ ఫ్లాట్‌లో అధికారులు గుర్తించారు. అయితే, ఆమె శరీరం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో, మరణం చాలా కాలం క్రితమే సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన పాకిస్థాన్ చిత్ర పరిశ్రమలో, ఆమె అభిమానులలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన నిజాలు
కరాచీ పోలీసుల దర్యాప్తులో పలు విషయాలె తెలిశాయి. పోస్టుమార్టం, ఇతర ఆధారాల ప్రకారం అధికారులు ఈ కింది విషయాలను ధ్రువీకరించారు. హుమైరా 2023 అక్టోబర్‌లోనే మరణించినట్లు అధికారులు నిర్ధారించారు.
చివరి ఫోన్ కాల్: ఆమె సెల్ ఫోన్ రికార్డుల ప్రకారం.. ఆమె చివరిసారిగా 2023 అక్టోబర్‌లో చివరిసారిగా ఫోన్ కాల్ మాట్లాడారు.
ఆమె ఫ్లాట్ ఉన్న అంతస్తులో మిగిలిన అపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల ఆమె మరణం తర్వాత వెలువడిన దుర్వాసనను ఎవరూ గుర్తించలేకపోయారు. ఆమెను చివరిసారిగా చూసింది కూడా ఆమె పొరుగువారే (2023 అక్టోబర్‌లో).
ఆమె 2023 అక్టోబర్ లో విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో అధికారులు ఆమె ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆమె ఇంట్లో దొరికిన ఆహార పదార్థాలు కూడా దాదాపు ఆరు నెలల క్రితం పాడైపోయాయని, జాడీలు తుప్పు పట్టి ఉన్నాయని అధికారులు తెలిపారు.
వాయిస్ మెసేజ్
హుమైరా తన స్నేహితురాలు దురేషెహ్వర్‌కు పంపిన ఒక వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2023 సెప్టెంబర్‌లో పంపిన ఆ ఆడియోలో ఆమె ఇలా అన్నారు.
“సారీ, నేను ప్రయాణంలో బిజీగా ఉన్నాను. నువ్వు మక్కా వెళ్లినందుకు చాలా సంతోషంగా ఉంది. నా కోసం, నీ ఈ క్యూట్ ఫ్రెండ్/చెల్లెలు కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించు. ముఖ్యంగా నా కెరీర్ కోసం తప్పకుండా ప్రార్థనలు చెయ్యాలి” అని అన్నారు.
హుమైరా అస్ఘర్ అలీ ఎవరు?
హుమైరా అస్ఘర్ అలీ పాకిస్థాన్‌లో మంచి గుర్తింపు ఉన్న కళాకారిణి. ఆమె ARY టీవీ రియాలిటీ షో “తమాషా ఘర్” ద్వారా పాపులర్ అయ్యారు. 2015లో వచ్చిన “జిలేబీ” అనే సినిమాలో నటించారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, ఒక థియేటర్ ఆర్టిస్ట్, పెయింటర్, శిల్పి.
ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చివరి పోస్ట్ 2023 సెప్టెంబర్ 30న చేశారు. ఒకవైపు లక్షలాది మంది అభిమానులు, సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఒక కళాకారిణి ఇలా ఒంటరిగా కన్నుమూయడం, ఆ విషయం నెలల తరబడి ఎవరికీ తెలియకపోవడం తీవ్ర విషాదకరం.