ఆల్‌టైం హైకి చేరిన బిట్‌కాయిన్.. మొట్టమొదటిసారి రూ.1,03,18,644కు.. ఎలాగంటే? ఇకపై మరింత కిక్కు..
"ప్రస్తుతం పలు పాజిటివ్ ట్రెండ్‌లు బిట్‌కాయిన్‌కి మద్దతు ఇస్తున్నాయి" అని ఐజీ మార్కెట్ అనలిస్ట్ టోనీ సైకమోర్ చెప్పారు.

Bitcoin
బిట్‌కాయిన్ $120,000 (రూ.1,03,18,644) స్థాయిని మొట్టమొదటిసారిగా ఇవాళ దాటింది. ఈ వారం క్రిప్టోకరెన్సీ పరిశ్రమకు అవసరమైన విధానాలు అమలవుతాయన్న సంకేతాలతో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టడంతో బిట్‌కాయిన్ ఆ స్థాయిని దాటిందని విశ్లేషకులు అంటున్నారు.
బిట్‌కాయిన్ రికార్డు స్థాయిలో గరిష్ఠంగా $122,571.19కి చేరి, అక్కడినుంచి స్వల్పంగా తగ్గి, చివరికి 2.4% పెరిగి $121,952.61 వద్ద ట్రేడ్ అయ్యింది. యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ డిజిటల్ సంపద పరిశ్రమకు అవసరమైన నిబంధనల బిల్లులపై చర్చించనుంది.
దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. తనను తాను “క్రిప్టో ప్రెసిడెంట్”గా ప్రకటించుకున్నారు. పరిశ్రమకు అనుకూలంగా నిబంధనలను మార్చాలని పాలసీ మేకర్లను కోరారు.
Also Read: మూడు రాష్ట్రాలకు గవర్నర్‌ల నియామకం.. గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు
“ప్రస్తుతం పలు పాజిటివ్ ట్రెండ్‌లు బిట్‌కాయిన్‌కి మద్దతు ఇస్తున్నాయి” అని ఐజీ మార్కెట్ అనలిస్ట్ టోనీ సైకమోర్ చెప్పారు. ఇన్‌స్టిట్యూషనల్ డిమాండ్, పెరుగుదలపై అంచనాలు, ట్రంప్ మద్దతు ఇవన్నీ బుల్ సెంటిమెంట్‌కి కారణాలని అన్నారు. $125,000 టార్గెట్ తాకడం కష్టమనిపించడంలేదని తెలిపారు. అంత బిట్‌కాయిన్ విలువ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
ఈ సంవత్సరం బిట్‌కాయిన్ విలువ 29% పెరిగింది. ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలోనూ క్రిప్టో మార్కెట్లో భారీ ర్యాలీ వచ్చింది. రెండవ అతిపెద్ద టోకెన్ అయిన ఈథర్ $3,059.60 వద్ద ఐదు నెలల గరిష్ఠాన్ని తాకింది. ఎక్స్‌ఆర్‌పీ, సోలానా రెండు సుమారు 3% పెరిగాయి.
కాయిన్‌మార్కెట్‌క్యాప్ డేటా ప్రకారం.. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూషన్ $3.81 ట్రిలియన్‌కు చేరింది. “బిట్‌కాయిన్‌ను రిటైల్ ఇన్వెస్టర్లు, ఇన్‌స్టిట్యూషన్లు మాత్రమే కాకుండా కొన్ని సెంట్రల్ బ్యాంకులు కూడా దీర్ఘకాలిక రిజర్వ్ అసెట్‌గా చూస్తున్నాయి” అని ఓకేఎక్స్ సింగపూర్ సీఈవో గ్రేసీ లిన్ చెప్పారు. బిట్‌కాయిన్‌కు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన స్థానం ఏర్పడుతుందనడానికి సంకేతాలు కనపడుతున్నాయన్నారు. ఇది కేవలం హైప్‌తో నడిచే ర్యాలీ కాదని తెలిపారు.
వారం రోజులను (జులై 14 నుంచి) “క్రిప్టో వీక్”గా అమెరికా ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ సభ్యులు ఇందుకు సంబంధించిన బిల్లులపై ఓటింగ్ చేయనున్నారు. ఈ బిల్లుల్లో అత్యంత కీలకమైనది జీనియస్ యాక్ట్. ఇది స్టేబుల్ కాయిన్లకు సంబంధించి ఫెడరల్ నియమాలను తీసుకురానుంది.