వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టు విచారణ.. కీలక ఆదేశాలు
ఈ కేసును తాజాగా సీఐడీతో విచారణ జరిపించేందుకు తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది.. సుప్రీంకోర్టుకు తెలిపారు.

Lawyer Gattu Vamanarao Case: తెలంగాణ న్యాయవాదులు గట్టు వామనరావు, పీవీ నాగమణి హత్య కేసుపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. వామనరావు కుమారుడు గట్టు కిషన్‌రావు వేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం వాదప్రతివాదనలు ఆలకించింది. ఈ కేసును తాజాగా సీఐడీతో విచారణ జరిపించేందుకు తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది.. సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఈ కేసులోని నిందితులను కూడా ప్రతివాదులుగా చేర్చి వారికి కూడా నోటీసులు ఇవ్వాలని పిటిషనర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం నిందితులంతా బెయిల్‌పై ఉన్నారని కోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. వారి వాదనలు కూడా విన్న తర్వాతనే తదుపరి నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎస్‌విఎన్ బట్టి ధర్మాసనం స్పష్టం చేసింది.
సీఐడీతో మరోసారి విచారణ జరిపించడానికి అభ్యంతరం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలను ధర్మాసనం రికార్డు చేసింది. సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించే విషయంపై సమాధానం చెప్పాలని నిందితులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలతో మరికొన్ని డాక్యుమెంట్లు, సీడీలు అందించేందుకు పిటిషనర్‌కు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
Also Read: విజయవాడలో విషాద ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
కాగా, 2021, ఫిబ్రవరి 17న గట్టు వామనరావు, పీవీ నాగమణి దారుణ హత్యకు గురయ్యారు. మంథని నుంచి కారులో హైదరాబాద్ వెళుతున్న వీరిని కల్వచర్ల సమీపంలో దుండగులు అడ్డుకున్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే వామనరావు దంపతులను దారుణంగా నరికి చంపారు. అప్పట్లో ఈ దారుణోదంతం తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది.