Live in relationships brutal murders: ప్రేమ కథలు విషాదంగా మారుతున్నాయి. సహజీవన హత్యలు సంచలనం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసు తరహాలోనే మరో ఇద్దరు మహిళలు హత్యకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. లివింగ్ రిలేషన్ లో ఉన్న ముగ్గురు మహిళలు వారి భాగస్వాముల చేతుల్లో దారుణంగా బలైపోవడంపై భయాందోళన వ్యక్తమవుతోంది. సహజీవనం చేస్తున్న మహిళల భద్రతకు భరోసా లేదని ఈ
దారుణోదంతాలు రుజువు చేస్తున్నాయి.
వరుస హత్యలతో భయాందోళన
దేశరాజధాని ఢిల్లీలో తాజాగా వెలుగు చూసిన నిక్కీ యాదవ్ హత్య, అంతకుముందు శ్రద్ధా వాకర్ దారుణ హత్య ఉదంతాలు ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. రెండు ఘటనల్లోనూ వారి భాగస్వాములే హంతకులుగా మారాయి. యువతులు పెళ్లి ప్రస్తావన తెగానే వారి పార్టనర్లు పాశవికంగా హత్యలకు పాల్పడ్డారు. ముఖ్యంగా శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. శ్రద్ధా వాకర్ ను హత్య చేసిన ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా.. ఆమె శరీరాన్ని 17 కంటే ఎక్కువ ముక్కలు చేసి పలు ప్రాంతాల్లో పడేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
భాగస్వాములే హంతకులు
శ్రద్ధా వాకర్ హత్య కేసు తర్వాత ఇద్దరు మహిళలను వారి భాగస్వాములు దారుణంగా హత్య చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఒక హత్య కేసు ఢిల్లీలో నమోదైతే, మరొకటి మహారాష్ట్రలో నమోదైంది. ఈ రెండు కేసుల్లో మహిళల భాగస్వాములే నిందితులుగా ఉన్నారు.
Also Read: ఢిల్లీ యువతి మృతదేహాన్ని ఫ్రిడ్జిలో ఉంచిన ఘటన.. చంపేముందు ఎంజాయ్ చేసిన ప్రియుడు
నిక్కీ యాదవ్ హత్య
నైరుతి ఢిల్లీ నజాఫ్‌గఢ్‌లో వెలుగులోకి వచ్చిన దిగ్భ్రాంతికరమైన సంఘటనలో 24 ఏళ్ల నిక్కీ యాదవ్ అనే యువతిని ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్ చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని తన దాబాలోని రిఫ్రిజిరేటర్‌లో దాచిపెట్టాడు. అంతేకాదు అదేరోజు మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి బయలుదేరాడు. తనను కాకుండా మరో యువతితో పెళ్లికి రెడీ అయిన తనను ప్రశ్నించినందుకే నిక్కీని చంపాడు సాహిల్. నిక్కీ యాదవ్ కోసం గాలించిన పోలీసులు అతడిని ప్రశ్నించడంతో ఈ దారుణోదంతం బయటపడింది.
మేఘా థోర్వి హత్య కేసు
మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో చోటుచేసుకున్న మరో ఘటనలో మేఘా థోర్వి అనే 37 ఏళ్ల తన భాగస్వామి హార్ధిక్ షా చేతిలో ప్రాణాలు కోల్పోయింది. జులాయిగా తిరిగే హార్ధిక్ డబ్బుల కోసం థోర్వితో గొడవ పడి పాశవికంగా ఆమె ప్రాణాలు తీశాడు. తర్వాత మృతదేహాన్ని మంచంలో దాచిపెట్టాడు. వాసన రాకుండా అగరుబత్తీలు కాల్చాడు. పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని పోలీసులు పట్టుకోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
Also Read: సహజీవనం చేస్తున్న ప్రేయసిని చంపిన ప్రియుడు.. మృతదేహాన్ని బెడ్ కింద దాచి పరార్
విషాదంగా ప్రేమకథలు.. తప్పెవరిది?
యువతీ యువకులు పరస్పరం ప్రేమించుకుని సహజీవనం చేయడం అనేది ప్రస్తుత కాలంలో సాధారణంగా మారింది. అయితే కొన్ని సందర్భాల్లో ఇవే ప్రమాదకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పెద్దలకు తెలియకుండా సాగించే సహజీవనాలు ఒక్కోసారి దారుణాలకు దారితీస్తున్నాయి. తాజా ఉదంతాలే ఇందుకు రుజువు. పెళ్లి ప్రస్తావన రానంత కాలం లివింగ్ రిలేషన్స్ సజావుగానే కొనసాగుతున్నట్టు కనబడుతోంది. భాగస్వాముల నుంచి పెళ్లి ప్రస్తావన రాగానే విభేదాలు రావడం.. అవి ఒక్కోసారి ప్రాణాలు తీసేవరకు వెళ్లడం వంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలను నమ్మించి వంచించే వాళ్లే ఎక్కువగా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. సహజీవనం సాగించే వారికి చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యుల అండ, సామాజికామోదం లేకపోవడం వల్ల ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయన్న భావన వ్యక్తమవుతోంది.