ప్రేమ పెళ్లి చేసుకుని ప్రియుడి నుంచి ఏకంగా రూ.11 లక్షలు కాజేసింది.. నువ్వెవ్వరో తెలియదంటూ కేసు పెట్టిన కిలాడి లేడి

ప్రేమ పేరుతో అబ్బాయిలే కాదు..అమ్మాయిలు కూడా మోసాలకు పాల్పడుతున్నారు. మేమేం తక్కువని అనుకుంటున్నారో…ఏమో…మోసాలకు పాల్పడుతూ లక్షలకు లక్షలు నొక్కేస్తున్నారు. ఒంగోలులో ఓ లేడి ముగ్గుర్ని పెళ్లాడి మోసం చేస్తే…ఇదే తరహాలో కరీంనగర్‌లో మరో లేడి ముగ్గుర్ని పెళ్లాడింది. ఇక తాజాగా…ప్రేమ పెళ్లి చేసుకుని ప్రియుడి నుంచి ఏకంగా 11 లక్షలు కాజేసిన ఓ కిలాడి లేడి బాగోతం వెలుగులోకి వచ్చింది.
అతడో సీఆర్పీయఫ్ కానిస్టేబుల్. స్వగ్రామంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ఒప్పుకోవడంతో…నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. భార్యను హాస్టల్‌లో ఉండమని చెప్పి…ఉద్యోగ నిమ్మితం వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన భర్తను నువ్వెవరంటూ ప్రశ్నించింది. పెళ్లైన నాలుగు నెలల కాలంలో తెలివిగా 11 లక్షలు తీసుకుంది. చివరకు భర్తపైనే కేసు పెట్టిందో కిలాడి లేడి.
రవితేజ, బిక్షాలమ్మ స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దొప్పలపూడి. ఇద్దరిది ఒకే గ్రామం..పక్కపక్కనే ఇళ్లు. దాంతో ప్రేమలో పడ్డారు. నాలుగేళ్ళపాటు ప్రేమించుకున్న వీరిద్దరూ ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా ఫిబ్రవరిలో చర్చిలో పెళ్ళి చేసుకున్నారు. మార్చి నెలలో బిక్షాలమ్మను వైజాగ్‌లోని హాస్టల్లో వదిలిపెట్టి ఆమె ఖర్చుల కోసం రెండు లక్షల రూపాయల నగదు ఇచ్చాడు. నగదుతో పాటు బంగారు
ఆభరణాలు స్కూటీ కొనిచ్చి రవితేజ ఉద్యోగ నిమిత్తం జమ్మూకశ్మీర్ వెళ్ళాడు.
కొద్ది రోజులకు బిక్షాలమ్మ హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిన విషయం తెలుసుకున్న రవితేజ గ్రామానికి చేరుకున్నాడు. హాస్టల్ నుంచి గ్రామానికి ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించాడు. దీంతో అతడికి ఊహించని షాక్ ఇచ్చింది ఆ లేడి. నువ్వెవరో నాకు తెలియదంటూ సమాధానం చెప్పడంతో అతడికి ఒక్కసారిగా దిమ్మతిరిగినంత పనైంది. అంతేకాదు భర్త వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. అక్కడి నుంచి ఇద్దరి మద్య గొడవలు మొదలైయ్యాయి. భార్యతో పాటు అత్తమామలు కూడా ఇబ్బందులు పెడుతుండటంతో చేసేదేమి లేక స్పందనకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. 11 లక్షల రూపాయల వరకు తీసుకుని…ఇప్పుడు ఎవరో తెలియదంటూ మాట్లాడుతుందని వాపోయాడు.
తన వద్ద డబ్బులు ఉన్నాయని తెలుసుకుని తనను ప్రేమలో దించిందని…తనను పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని బెదిరించిందని..అందుకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. నేనేవరో తనకు తెలియకపోతే నా మీద కేసు ఎలా పెడుతుందని ప్రశ్నించాడు. ఆ అమ్మాయి తనతో కాపురానికి వచ్చేలా…పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరాడు. మరి పోలీసులు ఆ యువతిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..బాధితుడికి ఎలా న్యాయం చేస్తారో చూడాలి.