డబ్బులు రావేమోనని : గుండెపోటుతో PMC బ్యాంకు ఖాతాదారుడు మృతి

పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్(PMC) బ్యాంకు ఖాతాదారుడు గుండెపోటుతో మరణించాడు. కొన్ని రోజులుగా పీఎంసీ బ్యాంకుపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని ఖాతాదారులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ముంబై కోర్టు బయట ఆందోళనలో పాల్గొన్న సంజయ్ గులాటి(51) కొద్ది సేపటికే గుండెపోటుతో మరణించాడు. తన తండ్రితో కలిసి ఆందోళనలో పాల్గొన్న సంజయ్ కొన్ని గంటల్లోనే ఇంట్లోని డైనింగ్ టేబుల్ పై ఒక్కసారిగా కూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు.
ఆర్థిక సంక్షోభం కారణంగా మూతబడిన జెట్ ఎయిర్ వేస్ లో ఉద్యోగం కోల్పోయిన సంజయ్ పీఎంసీ బ్యాంకులో 90లక్షలకుపైగా డిపాజిట్ చేశాడని,డబ్బులు రావేమో అన్న భయంతో కొన్ని రోజులగా ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడని ఆందోళకారుల్లో ఒకరైన మనాలీ నర్కర్ తెలిపారు. సంజయ్ గులాటీకి భార్యా,ఇద్దరు కుమారులు ఉన్నారు. పీఎంసీ డిపాజిటర్లు,సంజయ్ గులాటి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇవాళ(అక్టోబర్-15,2019) మధ్యాహ్నం సంజయ్ ఇంటిదగ్గరకు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు.
మాలో కూడా ఎవరైనా ఇలాంటి విధిని ఎదుర్కోవచ్చు..నా కుటుంబ సభ్యులలో ఆరుగురికి పీఎంసీ బ్యాంక్ లో ఖాతాలు ఉన్నాయని సంజయ్ పొరుగింటి వ్యక్తి విచారం వ్యక్తం చేశాడు. గవర్నమెంట్,ఆర్బీఐ ఎప్పుడు నిద్రలేస్తాయని ఓ మహిళ ప్రశ్నించింది. తన కుటుంబసభ్యులకు పీఎంసీలో మూడు అకౌంట్లు ఉన్నాయని,ఆర్బీఐ ఆంక్షల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపింది.