మర్డర్ మిస్టరీ : అదృశ్యమైన లా స్టూడెంట్.. చంపి ఇంట్లో పాతిపెట్టారు

ఘాజియాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వారం క్రితమే అదృశ్యమైన 27ఏళ్ల లా విద్యార్థి శవమై కనిపించాడు. ఖాళీ చేసిన ఇంటి పునాది కింద అతడి మృతదేహం దొరికింది. వివరాల్లోకి వెళితే… ఘాజియాబాద్ లోని పంకజ్ కుమార్ సింగ్.. ఐఎంఈ ఘాజిబాద్‌లో నాల్గో సంవత్సరం లా కోర్సు చదువుతున్నాడు. అక్టోబర్ 8 నుంచి అతడు కనిపించకుండా పోయాడు. తమ కుమారుడు కనిపించకపోవడంతో పంకజ్ కుటుంబ సభ్యులు షాహిబాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించారు. దర్యాప్తు లో భాగంగా పోలీసులు పంకజ్ చివరిసారిగా ఉన్న ఇంటిని పరిశీలించారు. ఆ ఇంట్లో బేస్ మెంట్ ఉపరితలం మెత్తగా ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ ప్రాంతాన్ని తవ్వగా.. ఆరు అడుగుల లోతులో పాక్షికంగా కుళ్లిన పంకజ్ మృతదేహం కనిపించినట్టు ఘాజియాబాద్ సిటీ ఎస్పీ మనీష్ మిశ్రా తెలిపారు. అయితే ఈ హత్య ఎవరూ చేసి ఉంటారు అనేదానిపై స్పష్టత లేదన్నారు.
ఇంట్లో ప్రతి గదిని పరిశీలించామని, ఎక్కడా కూడా కొత్తగా నిర్మాణం చేపట్టిన ఆనవాళ్లు లేవని, ఈ ఒక్క గది బేస్ మెంట్ మాత్రమే కాస్త కొత్తగా ఉండటంతో పోలీసులకు అనుమానం బలపడిందన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పంకజ్.. 15 రోజుల పాటు అక్కడే ఉన్నాక.. గిరిదార్ ఎన్ క్లేవ్ లో మరో ఇంటికి మకాం మార్చాడు. ఈ క్రమంలో యూపీలోని బలియాకు చెందిన పంకజ్.. అదే కాలనీలో సైబర్ కేఫ్ నడుపుతున్నాడు. ఫిబ్రవరిలో తన కేఫ్ ను మరో చోటుకు మార్చాడు.
నెలక్రితమే మున్నా యాదవ్ అనే వ్యక్తి నాలుగు అంతస్తుల భవనంలో ఫస్ట్ ఫోర్లోకి పంకజ్ మారాడు. యాదవ్ తన భార్య సులేఖ నలుగురు పిల్లలతో కలిసి రెండో ప్లోర్లో ఉంటున్నాడు. మున్నా తమ పిల్లలకు పంకజ్ టీచింగ్ ఇవ్వాలని పట్టుబట్టేవాడని, తమతో పాటు అదే ప్లోర్ లో ఉండాలని అడిగేవాడని, అందుకు పంకజ్ అంగీకరించకపోవడంతో గొడవ జరిగిందని, దీంతో పంకజ్ మరో ఇంటికి మారి ఉండవచ్చునని అతడి సోదరుడు పోలీసులకు వివరించాడు.
వ్యక్తిగత కారణాలతో పంకజ్ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పంకజ్ హత్యకు మున్నాకు సంబంధం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంకజ్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని ఎస్పీ మిశ్రా తెలిపారు.