మీ తెలివికి హ్యాట్సాఫ్ : పెళ్లి పేరుతో క్రిమినల్ ను అరెస్ట్ చేసిన మహిళా ఎస్సై

  • Published By: chvmurthy ,Published On : December 1, 2019 / 05:54 AM IST
మీ తెలివికి హ్యాట్సాఫ్ : పెళ్లి పేరుతో క్రిమినల్ ను అరెస్ట్ చేసిన మహిళా ఎస్సై

Updated On : December 1, 2019 / 5:54 AM IST

పోలీసు డిపార్ట్ మెంట్ ను ముప్పతిప్పలు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను  పట్టుకోటానికి పోలీసులు సరికొత్త వ్యూహం పన్నారు. మహిళా ఎస్సైతో మ్యారేజ్ ప్రపోజల్ పంపించారు. అడది వలచి.. వస్తోందనే సరికి టిప్పు టాపుగా పెళ్ళి చేసుకోటానికి వచ్చి పోలీసులకు చిక్కాడు ఆ కంత్రీ దొంగ.

మధ్యప్రదేశ్లోని ఛతర్ పూర్ జిల్లాలో  బాలకృష్ణ చౌబే(55) అనే నేరస్తుడు పోలీసులకు తలనొప్పిగా తయారయ్యాడు. అతనిపై హత్య నేరంతో సహా 16 కి పైగా దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. గత 3 ఏళ్ళుగా అతడ్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్న పోలీసులకు చిక్కకుండా తప్పించుకు పోతున్నాడు. అనేక సార్లు పోలీసుల అతని స్ధావరాలపై దాడి చేసినా బాలకృష్ణ మాత్రం చిక్కటం లేదు. మధ్యప్రదేశ్ లో నేరాలు చేయటం. సమీపంలోని ఉత్తర ప్రదేశ్ సరిహద్దు గ్రామాల్లోకి వెళ్లి తలదాచుకోవటం చేస్తున్నాడు. 

విసిగిపోయిన పోలీసులు ఇంక కొత్త ప్లాన్ వేశారు. ఛతర్‌పూర్ జిల్లా నౌగావ్ బ్లాక్‌కు చెందిన గారోలి చౌకి పోలీసు స్టేషన్ ఎస్ఐ మాధవి అగ్నిహోత్రికి బాలకృష్ణను అరెస్టు చేసే పనిని అప్పగించారు. రంగంలోకిదిగిన మాధవి అగ్నిహోత్రికి కొత్తఆలోచన వచ్చింది. వెంటనే తన పై అధికారులైన సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్  శ్రీనాధ్ సింగ్ బాగ్లే కు  తన ప్లాన్ చెప్పింది.  అగ్నిహోత్రి ఆలోచనకు ఓకే చెప్పిన శ్రీనాధ్ సింగ్ ఆమెకు తోడుగా మరో ఇద్దరు ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను కేటాయించారు. 

రంగంలోకి దిగిన టీమ్ తమ వర్క్ స్టార్ట్ చేసింది. ఎస్ఐ మాధవి అగ్నిహోత్రి కొంత మంది మధ్య వర్తుల ద్వారా తన పాత ఫోటోలను పంపిస్తూ బాలకృష్ణ చౌబేకి పెళ్లి ప్రపోజల్ పంపించింది. వారి ద్వారా నేరస్తుడు బాలకృష్ణ తో ఫోన్ లో మాట్లాడటం మొదలెట్టింది. క్రమేపి అతడు తనవైపు ఆకర్షితుడయ్యేలా మాట్లాడింది. చివరికి పెళ్లి చేసుకుందామని చెప్పి ముహూర్తం  ఫిక్స్ చేసింది. అందుకోసం  నౌగావ్  పోలీసు స్టేషన్  సరిహద్దు..ఉత్తరప్రదేశ్ లోని బిజోరి గ్రామంలోని ఓ గుడిలో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. తన టీంతో పాటు బిజోరి గ్రామంలో మఫ్టీలో మరికొంత మంది పోలీసులను ఏర్పాటు చేసుకున్నారు.  బాలకృష్ణ చౌబే పెళ్లి చేసుకోవటానికి టిప్పు టాపుగా తయారై గుడికి చేరుకున్నాడు. అతడ్ని మాటల్లో దింపి అరెస్టు చేసింది మాధవి అగ్నిహోత్రి. నిశ్చేష్టుడైన బాలకృష్ణ తన తుపాకీతో ఆమె దాడి చేయటానికి యత్నించగా అప్పటికే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు.