Harish Rao : కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దు.. ఒకవేళ పెట్టినా..! హైకోర్టులో హరీశ్‌రావు ఐఏ పిటిషన్
Harish Rao : కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీ ప్రవేశపెట్టకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హరీశ్ రావు హైకోర్టులో

Harish Rao
Harish Rao : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అయితే, ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
Also Read : BRS MLAs Arrested: వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్, హరీశ్‌సహా బీఆర్ఎస్ నేతలు అరెస్టు
కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో హరీశ్ రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక ప్రవేశపెట్టొద్దు. ఒకవేళ కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చించినా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌పై వాదనలు సోమవారం వింటామని హైకోర్టు పేర్కొంది.
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దెత్తున అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది.
ఈ కమిషన్ 15నెలల పాటు విచారణ జరిపింది. ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆ తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్ రావులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వీటిపై హైకోర్టులో వాదోపవాదనలు జరిగాయి. అయితే, కేసీఆర్, హరీష్ రావులు కోరిన మధ్యంతర ఉత్తర్వుల పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణను వాయిదా వేసింది.