MS Dhoni : ధోనికి బీసీసీఐ బంపర్ ఆఫర్.. ఒప్పుకుంటే ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాల్సిందేనా?
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni)కి బీసీసీఐ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

Is BCCI given Bumper Offer to MS Dhoni
MS Dhoni : భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు, ఓ ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి బీసీసీఐ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. టీమ్ఇండియా మెంటార్‌గా మరోసారి ధోనిని (MS Dhoni) నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2021 టీ20 ప్రపంచకప్ సమయంలో ధోని ని టీమ్ఇండియా మెంటార్‌గా బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. కేవలం ఆ టోర్నీ వరకే అతడి సేవలు ఉపయోగించుకుంది. అయితే.. ఆ టోర్నీలో టీమ్ఇండియా ఘోరంగా విఫలమైంది. లీగ్ స్టేజీలోనే ఇంటి ముఖం పట్టింది. ఆ తరువాత మరోసారి భారత కోచింగ్ సెటప్‌లో ధోని ఎప్పుడూ భాగం కాలేదు.
అయితే.. ఈ సారి అలా ఓ టోర్నీకే పరిమితం కాకుండా.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతడిని ఎక్కువ కాలం మెంటార్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు క్రిక్‌బ్లాగర్ తెలిపింది. యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో అతడు కీలక పాత్ర పోషిస్తాడని బోర్డు విశ్వసిస్తున్నట్లుగా పేర్కొంది. అయితే.. ఇందుకు ధోని అంగీకరిస్తాడా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
గంభీర్ మాటేంటి?
ధోని కెప్టెన్సీలో గెలిచిన వన్డే, టీ20 ప్రపంచకప్‌లో గౌతమ్ గంభీర్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే.. ప్రపంచకప్ విజయాల క్రెడిట్ మొత్తం ధోని ఒక్కడికే ఇవ్వడం సరికాదు అంటూ ఇప్పటికే చాలా సందర్భాల్లో గంభీర్ బహిరంగంగానే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ధోని మెంటార్‌గా గంభీర్ ఒప్పుకుంటాడా? అన్నది పెద్ద ప్రశ్నే.
RCB : ఆర్సీబీ ‘కేర్స్’ మొదలైంది.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు..
ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ కార్యక్రమంలో ధోని, గంభీర్‌లు సరదాగా మాట్లాడుకున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్‌కు గుడ్ బై చెబుతాడా?
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. వచ్చే సీజన్‌లోనూ అతడు కొనసాగాలని ఆశిస్తున్నాడు. ఒకవేళ బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌కు ధోని ఒకే చెబితే అప్పుడు విరుద్ద ప్రయోజనాల ప్రశ్న తలెత్తుతుంది. అప్పుడు ఖచ్చితంగా అతడు ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాల్సి ఉంటుందని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.