‘ఖాకీ’ మూవీ తరహాలో కేటుగాళ్ల అరెస్ట్ : రాజస్థాన్‌లో నల్గొండ పోలీసుల సాహసం

Nalgonda cops nab Rajasthan gang : పోలీసుల పేరుతోనే నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. అడ్డదారుల్లో మోసాలకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. పోలీసుల పేరుతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరి దందాకు పాల్పడ్డారు. పోలీసులనే తమ ప్లాన్‌లో భాగం చేసేసింది ఈ ముఠా. అలా ఒక్క రాష్ట్రమే కాదు.. సుమారు 5 దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారుల పేరుతో ఫేక్ FB అకౌంట్లు క్రియేట్ చేసి ఆపరేట్ చేస్తోంది ఈ గ్యాంగ్. ఏకంగా జిల్లా ఎస్పీ, డీఐజీ రంగనాథ్ పేరుతోనే అకౌంట్ క్రియేట్ చేసింది.
ఫేక్ అకౌంట్ నుంచి డబ్బులు డిమాండ్ చేయడంపై సీరియస్‌గా తీసుకున్నారు నల్లగొండ పోలీసులు. సైబర్ అపరేషన్స్‌లో అనుభవమున్న ఇన్‌స్పెక్టర్ మహబూబ్ బాషా, ఎస్సై రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృందం ఈ ముఠాను పట్టుకునేందుకు వేట ప్రారంభించింది. చివరకు రాజస్థాన్‌లోని ఓ మారుమూల గ్రామం కేంద్రంగా ఈ ముఠా నకిలీ ఖాతాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల కోసం ఆ ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడి పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో.. అక్కడి పోలీసుల సహకారం నామమాత్రంగానే ఉండడంతో నిందితులను గుర్తించినా వెంటనే అరెస్ట్ చేయలేకపోయారు.
కేటుగాళ్ల ఆట కట్టించిన నల్గొండ పోలీసులు :
హీరో కార్తీక్ నటించిన ఖాకీ మూవీ తరహాలో కేటుగాళ్లను నల్గొండ జిల్లా పోలీసులు ఆటకట్టించారు. సినిమా సీన్‌లను తలపించేలా డేరింగ్ స్టెప్స్ తీసుకుని మరీ రాజస్థాన్ నుంచి ఈ కేటుగాళ్లను అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. రాజస్థాన్ అంటే సినిమాల్లో చూపించినట్టే కాదు.. రియల్‌గానూ అలాంటి భయానక సీన్‌లు ఉంటాయి.
ఏ మాత్రం తేడా వచ్చిన గ్రామస్థులు పోలీసులపై దాడి చేసే పరిస్థితులు.. అవసరమైతే నాటు తుపాకులతో కాల్పులకు తెగబడతారు.. అలాంటి భయాన పరిస్థితిల్లో.. ఆ పరిసర ప్రాంతాల్లో కొన్నాళ్లు కారు డ్రైవర్లుగా.. వివిధ పనులపై వచ్చిన వారుగా నల్లగొండ పోలీసులు అక్కడి తిరిగారు. ఎక్కడా పోలీసులమనే అనుమానం రాకుండా.. చింపిరి గడ్డం, షార్ట్స్, లుంగీలతో ఆ ప్రాంతంలో వారితో కలిసిపోయారు.
10 నిమిషాల్లో ముఠా భరతం పట్టారు :
కొన్నిసార్లు రోడ్లపైనే పడుకున్నారు. లోకల్ పోలీసుల సహకారం పెద్దగా లేకపోయినా.. దాదాపు ఐదు రోజుల పాటు పక్కాగా స్కెచ్ వేసి.. ఓ తెల్లవారుజామున ఆ ముఠా సభ్యులను అరెస్ట్ చేసి ఊరు దాటించారు. కేవలం 10 నిమిషాల్లో తమ పని ముగించారు. దాదాపు 5 రాష్ట్రాల పోలీసులను వేధిస్తున్న ఫేక్ అకౌంట్ల తతంగానికి చెక్ పెట్టారు నల్లగొండ పోలీసులు.
ఈ ముఠా బారిన 5 రాష్ట్రాల పోలీసులు ఉండగా తెలంగాణ పోలీసులు ఈ ముఠా భరతం పట్టడంతో.. అన్ని రాష్ట్రాల పోలీస్ అధికారుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఆపరేషన్‌లో చాలా ఇబ్బంది పడ్డామని.. స్థానిక పోలీసుల సహకారం పెద్దగా అందలేదని ఆపరేషన్ కేత్వాడ టీమ్ చెబుతోంది. ఏది ఏమైనా నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ల ముఠా గుట్టురట్టు చేయడంలో నల్గొండ పోలీసులు రియల్ పోలీసులు అనిపించుకున్నారు.