జయరామ్‌ హత్య : కుటుంబ కలహాలే కారణమా? 

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు.

  • Published By: veegamteam ,Published On : February 2, 2019 / 06:16 PM IST
జయరామ్‌ హత్య : కుటుంబ కలహాలే కారణమా? 

Updated On : February 2, 2019 / 6:16 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు.

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన వ్యాపారవేత్త జయరామ్‌ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్యగా నిర్ధారించారు. హైదరాబాద్‌తో పాటు.. నందిగామ, జగ్గయ్యపేటలో పలువురిని పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు.. ఆయన మేనకోడలు శ్రిఖా చౌదరి, ఆమె సన్నిహితుడు రాకేశ్‌చౌదరితో పాటు మరొకరిని ప్రశ్నిస్తున్నారు.
 
ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ కలహాలతోనే జయరామ్‌ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. జయరామ్‌ మేనకోడలు శ్రిఖా చౌదరి, ఆమె చెల్లెలు మనీషా, శ్రిఖా చౌదరి స్నేహితుడు రాకేశ్‌ చౌదరి, శ్రీకాంత్‌ రెడ్డిలను కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డీఎస్పీ బోస్ విచారించారు. ఈ కేసులో శ్రిఖా చౌదరి పాత్ర ఏంటనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. 

జయరాం ఒంటిపై తీవ్రమైన గాయాలు లేకపోవడంతో ఆయనపై విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. జయరాంకు అనేక వివాదాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జనవరి 30న హైదరాబాద్ దస్‌పల్లా హోటల్‌లో ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన జయరామ్…  ఆ తర్వాత ఓ వ్యక్తితో కలిసి బయటకు వెళ్తున్నట్లుగా సీసీ టీవీ ఫుటేజీ దృశ్యాల్లో గుర్తించారు. జయరామ్ హత్యకు గురైన జనవరి 31వ తేదీన రాత్రి 11గంటల 42 నిమిషాలకు ఇంటినుంచి బయటికి వెళ్లిన ఆయన, మేనకోడలు శ్రిఖాచౌదరి.. ఆ తర్వాత ఎప్పుడు తిరిగివచ్చారనే దానిపై స్పష్టత లేదు. అయితే.. ఆమె అర్ధరాత్రి ఒంటిగంటా 5 నిమిషాలకు కారులో వెళ్లినట్లు సెక్యూరిటీ రికార్డ్స్‌లో ఎంటర్ చేశారు. 

జనవరి 29న మధ్యాహ్నం శ్రిఖాచౌదరి ఇంటికి వెళ్లిన చిగురుపాటి జయరామ్‌ను.. రాత్రి 9గంటలకు శ్రిఖా డ్రైవర్ డ్రాప్ చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. శ్రిఖాచౌదరి గతంలో రాకేష్ అనే యువకుడి దగ్గర 4కోట్ల రూపాయలు అప్పు తీసుకుందని.. ఈ విషయంలో వారిద్దరి మధ్య గొడవులున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆ డబ్బును తానే చెల్లిస్తానని జయరామ్ వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలావుంటే.. జయరామ్‌ చనిపోయిన తర్వాత రాకేశ్‌తో కలిసి శ్రిఖా ఆయన ఇంటి వెళ్లి కీలక పత్రాల కోసం గంటసేపు గాలించినట్టు తేలింది. బెడ్‌రూం తాళాలు ఇచ్చేందుకు నిరాకరించిన జయరామ్‌ వ్యక్తిగత సిబ్బందిపై వీరిద్దరూ దాడి చేసినట్టు సమాచారం. 

ఇక ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని.. అనుమానం ఉన్నవారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న జయరామ్‌ కుటుంబీకులు ఇంకా హైదరాబాద్‌ చేరుకోకపోవడంతో జయరామ్‌ అంత్యక్రియలు ఆలస్యం కానున్నాయి.