Balendra Shah: నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా? ఎవరీ బాలెన్.. యువత ఎందుకు మద్దతు పలుకుతోంది.. భారత్ తో ఉన్న సంబంధం ఏంటి..

నేపాల్ నూతన ప్రధాని రేసులో వినిపిస్తున్న పేరు ఎవరిది? ఆయనకు అక్కడి యువత మద్దతుగా ఎందుకు నిలుస్తోంది? భారత్ తో ఆయనకున్న రిలేషన్ ఏంటి.. తెలుసుకుందాం..

Balendra Shah: నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా? ఎవరీ బాలెన్.. యువత ఎందుకు మద్దతు పలుకుతోంది.. భారత్ తో ఉన్న సంబంధం ఏంటి..

Updated On : September 10, 2025 / 5:38 PM IST

Balendra Shah: నేపాల్ లో రాజకీయ సంక్షోభం ముదిరింది. యువత చేపట్టిన ఆందోళనలు ఆ దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. సోషల్‌ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం చిచ్చు రాజేసింది. ప్రభుత్వ నిర్ణయంపై యువత భగ్గుమంది. జనరేషన్‌ జెడ్‌ యువత రోడ్డెక్కింది. ఆందోళన బాట పట్టింది. వీరి ఆందోళనలు, నిరసనలతో నేపాల్ అట్టుడికిపోయింది. ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలను అక్కడి ప్రభుత్వం తట్టుకోలేకపోయింది. పరిస్థితి చేయి దాటిపోడంతో కేపీ శర్మ ఓలి ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కేపీ శర్మ ఓలి రాజీనామా తర్వాత నేపాల్ నెక్ట్స్ ప్రధాని ఎవరు? అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలో నేపాల్‌ తదుపరి ప్రధాని రేసులో బాలేంద్ర షా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బాలేంద్ర షా.. బాలెన్ గా సుపరిచితులు. సోషల్‌ మీడియాపై బ్యాన్‌, అవినీతిపై ఆందోళన చేస్తున్న యువతే బాలేంద్ర షాకు మద్దతు పలకడం విశేషం. ఆయనే నేపాల్‌ నూతన ప్రధాని అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది జనరేషన్ జెడ్. ఇంతకీ ఎవరీ బాలేంద్ర షా? ఆయన ప్రత్యేకత ఏంటి? యువత ఆయనకు ఎందుకు మద్దతుగా నిలిచింది?

ఎవరీ బాలెన్..

బాలెన్‌ షా.. ప్రస్తుతం ఖాట్మండ్ మేయర్ గా వున్నారు. 1990లో కాట్మండులో జన్మించారు. ఆయన ఒకప్పుడు రాపర్. లిరిసిస్ట్ కూడా. తన పాటల ద్వారా రాజకీయ అవినీతి, సామాజిక అసమానతలపై విమర్శలు చేశారు. బలిదాన్‌ అనే పాటకు యూట్యూబ్‌లో 7 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందిన బాలెన్, 2022లో స్వతంత్ర అభ్యర్థిగా ఖాట్మండ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. 61వేల ఓట్లతో ఆయన ఆ ఎన్నికల్లో గెలుపొందారు.

బాలెన్ వయసు 35 ఏళ్లు. ర్యాపర్ టర్న్డ్ పొలిటీషియన్. ఖాట్మండు 15వ మేయర్ గా ఉన్నారు. ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. భారత్ తో బాలెన్ కు సంబంధం ఉంది. కర్నాటకలో ఆయన చదువుకున్నారు. కర్నాటకలోని విశ్వేశ్వర టెక్నాలజికల్ యూనివర్సిటీలో స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ చదివారు. రాజకీయాల్లోకి రాకముందు నేపాల్ హిప్-హాప్ రంగంలో చురుకుగా ఉండేవారు. అవినీతి , అసమానతలను హైలైట్ చేయడానికి తన సంగీతాన్ని ఉపయోగించారు.

భారతీయ సినిమాలపై బ్యాన్..

జూన్ 2023లో, ఆదిపురుష్ సినిమాలోని ఒక డైలాగ్ కారణంగా ఖాట్మండులో భారతీయ చిత్రాల ప్రదర్శనను నిషేధించడం ద్వారా ఆయన జాతీయ దృష్టిని ఆకర్షించారు.

నేపాల్ నూతన ప్రధాని బాలేంద్ర షానే అంటూ సోషల్‌ మీడియాలో యువత క్యాంపెయిన్‌ చేస్తోంది. పార్టీల కోసం పని చేసే నాయకులు కాదు, ప్రజల కోసం పని చేసే లీడర్ కావాలనే నినాదంతో బాలెన్ పేరుతో సోషల్‌ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. బాలెన్‌ దాయ్‌.. టేక్‌ ద లీడ్ అనే హ్యాష్‌ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన జనరేషన్‌ జెడ్‌కు బాలెన్‌ షా మద్దుతు పలికారు. ఈ ఉద్యమం పూర్తిగా జనరేషన్‌ జెడ్‌ ఆధ్వర్యంలో కొనసాగుతోందన్నారు. వయసు పరిమితి కారణంగా వారి ఆందోళనలో తాను పాల్గొనలేదని తెలిపారు. కానీ వారి ఆవేశాలను అర్థం చేసుకోవాలనుకుంటున్నా అని వెల్లడించారు.

ప్రధాని కెపి శర్మ ఓలి, ఇతర మంత్రుల రాజీనామా డిమాండ్ ఇప్పటికే నెరవేరింది. నిరసనకారులు సంయమనం పాటించాలి. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు మరింత నష్టం చేయొద్దు. దేశ సంపద కోల్పోవడం అంటే వాస్తవానికి మన సొంత ఆస్తిని కోల్పోవడం లాంటిది. ఇప్పుడు మనమందరం సంయమనంతో వ్యవహరించడం చాలా అవసరం” అని సోషల్ మీడియాలో జనరేషన్ జెడ్ కు విజ్ఞప్తి చేశారు బాలెన్.

సోషల్ మీడియాపై బ్యాన్ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో యువత రగిలిపోయింది. బ్యాన్ ను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. హింస చెలరేగింది. జనరేషన్‌ జెడ్‌ యువత ఆధ్వర్యంలో సాగిన ఈ ఉద్యమంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సైన్యం ఆదేశాలతో కేపీ శర్మ ఓలి మంగళవారం ప్రధాని పదవికి రిజైన్ చేశారు. అటు పలువురు మంత్రులపైనా దాడి జరిగింది. వీధుల్లో ఉరికించి ఉరికించి మరీ కొట్టారు. ఆందోళనకారులు వారి ఇళ్లకు నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన