మరింత కక్కుతాడా : రాకేష్ రెడ్డి కస్టడీ పొడిగింపు

  • Published By: madhu ,Published On : February 16, 2019 / 06:42 AM IST
మరింత కక్కుతాడా : రాకేష్ రెడ్డి కస్టడీ పొడిగింపు

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ రెడ్డి కస్టడీని కోర్టు పొడిగించింది. మూడు రోజుల కస్టడీ ముగియడంతో అతడిని ఫిబ్రవరి 16వ తేదీన కోర్టు ఎదుట హాజరు పరిచారు. అంతకంటే ముందు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టు ఎదుట హాజరు పరిచారు పోలీసులు. కేసులో మరింత సమాచారం రావాల్సి ఉన్నందున రాకేష్ రెడ్డి కస్టడీని పొడిగించాలని బంజారాహిల్స్ పోలీసులు కోర్టును అభ్యర్థించారు. పోలీసుల అభ్యర్థనను కోర్టు సమ్మతించింది. మరో 8 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతినిస్తూ తీర్పును చెప్పింది. 

జయరాం మర్డర్ మిస్టరీ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి అని తేల్చిన పోలీసులు..ఇతడికి ఎవరు సపోర్టు ఇచ్చారనే దానిపై కూపీ లాగుతున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ, బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. కీలకంగా అనుమానిస్తున్న శిఖా చౌదరిని కూడా పోలీసులు విచారించారు. చింతల్ రౌడీ షీటర్‌ నగేష్‌..అతడి మేనల్లుడు విశాల్‌, డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెడ్డిలకు.. జయరాంను హత్యలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

జయరాంను చంపేస్తున్నట్లు…చనిపోతేనే ఆస్తులు వస్తాయని…ఆ ముగ్గురికి రాకేష్ చెప్పినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చిన సందర్భంగా పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 16వ తేదీ శనివారం ఈ సమావేశం జరుగనుందని తెలుస్తోంది. మరి 8 రోజుల పాటు విధించిన కస్టడీలో రాకేష్ ఇంకా ఎలాంటి విషయాలు చెబుతాడో చూడాలి.