అమ్మాయిలూ… కామాంధులు ఉన్నారు జాగ్రత్త.. మీరు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారా..? ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తారా? పర్సనల్‌ విషయాలన్నీ షేర్‌ చేస్తారా?

  • Published By: naveen ,Published On : October 8, 2020 / 11:00 AM IST
అమ్మాయిలూ… కామాంధులు ఉన్నారు జాగ్రత్త.. మీరు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారా..? ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తారా? పర్సనల్‌ విషయాలన్నీ షేర్‌ చేస్తారా?

Updated On : October 8, 2020 / 11:26 AM IST

social media cheaters: మీరు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారా..? ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎవరు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిన యాక్సెప్ట్‌ చేస్తున్నారా..? పర్సనల్‌ విషయాలన్నీ వారితో షేర్‌ చేసుకుంటున్నారా..? అయితే ఇకపై కాస్త జాగ్రత్త. ఎందుకంటే…మీ చుట్టూ కీచకులున్నారు. కాటేసే కామాంధులున్నారు. మంచిగా నటిస్తూ కావాల్సినవన్నీ తీసుకుంటారు. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతారు. చివరకు మీ జీవితాలను నాశనం చేస్తారు. అమ్మాయిలే ఆ చీటర్స్‌ టార్గెట్‌.. వేధింపులు, బెదిరింపులే వారి లక్ష్యం.. ఫేస్‌బుక్‌ వేదికగా ఒకడు.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మరొకడు.. ముందు స్నేహమంటారు.. చివరకు సైకోల్లాగా ప్రవర్తిస్తారు.




అమ్మాయిల పేర్లతో నకిలీ అకౌంట్లు:
ఫేస్‌బుక్‌….ప్రస్తుతం ప్రపంచం మొత్తం అరచేతిలో ఇది దర్శనమిస్తుంది. నోట్‌బుక్ అంటే తెలియని వాళ్ళకు కూడా ఫేస్‌బుక్ పరిచయం ఉంటుంది. మన సంతోషాలని, బాధలని అందరికి ఒకే వేదిక మీద పంచే సాధనం ఈ ఫేస్‌బుక్‌. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా ఎక్కువగా యూజ్‌ చేస్తుంటారు. అయితే ఈ సోషల్‌ మీడియా వెబ్‌సైట్స్‌ ద్వారా.. ఎంతోమంది యువతులు మోసపోయారు..ఇప్పటికి మోసపోతూనే ఉన్నారు. అబ్బాయిలు అమ్మాయిల్లాగా…నకిలీ అకౌంట్‌ క్రియేట్‌లు చేయడం…మాయమాటలు చెప్పి దగ్గరవడం..ఆ తర్వాత మోసం చేయడం..ఈ మధ్య కామన్‌ అయిపోయింది.

ఫొటోలు మార్ఫింగ్, నగ్న చిత్రాలు సేకరణ.. ఆపై లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్:
సాధారణంగా అమ్మాయిలకు ఫొటోలు దిగడమంటే పిచ్చి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఫొటోలు దిగుతుంటారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్‌ మీడియా సైట్లలో పోస్ట్‌ చేస్తూ…వాటికి వచ్చే లైక్‌లు, కామెంట్లను చూసి మురిసిపోతుంటారు. అయితే ఇందులో వాళ్ల తప్పేమి లేదు. కానీ..కొందరు కేటుగాళ్లు…ఆ ఫొటోలను యూజ్‌ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తున్నారు.

అనంతరం వాటిని చూపించి బెదిరిస్తూ నగ్న చిత్రాలు సేకరిస్తున్నారు. తిరిగి వాటిని వారికే చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు డిమాండ్‌ చేస్తూ..మానసికంగా టార్చర్‌ పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇద్దరు కీచకుల బాగోతం వెలుగులోకి వచ్చింది.

వృత్తి క్యాబ్ డ్రైవర్.. ప్రవృత్తి బ్లాక్ మెయిల్:
ఫణీందర్‌ రెడ్డి. సూర్యాపేట మండలం యార్కారం నివాసి. హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్‌. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిణిల పికప్‌, డ్రాప్‌ సమయంలో వారితో మంచిగా మాట్లాడుతూ ఉండేవాడు. వారు కూడా ఇతడితో స్నేహంగా మెలిగేవారు. తమ సహోద్యోగుల వివాహ, పుట్టిన రోజు వేడుకలకు అతన్ని ఆహ్వానించేవారు. కలిసి ఫొటోలు దిగేవారు. అయితే అలా దిగిన ఫొటోల్లో…అమ్మాయిలతో కాస్త దగ్గరగా ఉన్న ఫొటోలను సెలెక్ట్‌ చేసుకునేవాడు. అనంతరం ఆ ఫొటోలను వారికి పంపించి డబ్బు డిమాండ్‌ చేసేవాడు. బాధితుల ఫిర్యాదుతో ఇతగాడ్ని సూర్యాపేటలో అరెస్టు చేశారు.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ డీపీ ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసి ఫేక్ అకౌంట్లు:
కిరణ్‌కుమార్‌ రెడ్డి. ఇతడిది కూడా సూర్యాపేట జిల్లానే. నూతన్‌కల్‌కు చెందిన ఇతగాడు తాగుడుకు బానిసయ్యాడు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ల్లో అమ్మాయిల డీపీలోని ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకుంటాడు. వారి పేరిట నకిలీ ఖాతాలు తెరుస్తాడు. ఆమె స్నేహితులకు ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌లు పంపి ఛాటింగ్‌ చేస్తాడు. ఆ తర్వాత అసభ్యకరమైన వ్యాఖ్యలు, చిత్రాలను పంపిస్తుంటాడు. అవతలి వ్యక్తులు నిలదీస్తే పోలీసులకు దొరక్కుండా ఆధారాలు మాయం చేసి నకిలీ ఖాతాను రద్దు చేస్తాడు.

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహితను ఇలా వేధించడంతో ఆమె హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సూర్యాపేటలో ఉన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఓవైపు పోలీసులు చీటర్స్‌పై చర్యలు తీసుకుంటున్నా.. యువతులకు సోషల్‌ మీడియా ద్వారా వేధింపులు మాత్రం తప్పడం లేదు. కౌన్సిలింగ్‌లు ఇస్తున్నా..మార్పు రాకపోగా మరింత రెచ్చిపోతున్నారు.




అమ్మాయిలు జాగ్రత్త.. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ లు యాక్సెప్ట్ చేయొద్దు:
అమ్మాయిలు..ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్ముతుండటంతోనే…అటు కీచకులు మరింత రెచ్చిపోతున్నారు. ఏ అమ్మాయి అయినా సరే…ముందు చేయాల్సిన పని..ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు వస్తే…పూర్తి వివరాలు తెలుసుకున్నాకే యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాతే అవతలి వ్యక్తితో ముందుకెళ్లాలి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌లను ఎంతవరకు యూజ్‌ చేయాలో అంతే యూజ్‌ చేయండి.

సమయం దొరికింది కదా అని…ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేస్తూ…వచ్చిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్‌ చేస్తే…ఇదిగో తర్వాత ఎదురయ్యే పరిణామాలు ఇలాగే ఉంటాయి. పోలీసులు కూడా పదే పదే చెబుతున్నా…చాలా మంది ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటున్నారు. చివరకు మోసపోయి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

ఇకనైనా..మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. సోషల్‌ మీడియాలో ఫొటోలు అప్‌లోడ్‌ చేసేముందు ఒక్కక్షణం ఆలోచించండి. వీలైతే ఫొటోలు పెట్టడం ఇక నుంచి మానుకోండి. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.