32 రేప్‌లు, అంతా కాలేజీ విద్యార్థులే : కరుడుగట్టిన గ్యాంగ్ అరెస్ట్

ఏలూరు: 32 అత్యాచారాలు, అంతా కాలేజీ విద్యార్థినులే.. ఒంటరి యువతులు, ప్రేమ జంటలే టార్గెట్.. అడ్డు చెబితే చంపేస్తారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గుంటుపల్లి శ్రీధరణి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కరుడుగట్టిన నరహంతకుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ధరణి హత్య కేసులో నలుగురు నిందితులను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. తుపాకుల సోమయ్య, గంగయ్య, నాగరాజులతో కలిసి అంకమరావు ఈ నేరాన్ని చేసినట్టు పోలీసులు తెలిపారు. నవీన్‌పై మొదట కర్రతో దాడి చేశారని.. అనంతరం ధరణిపై అత్యాచారం చేసి.. ఆమెను కూడా కర్రతో కొట్టి చంపారని పోలీసులు వివరించారు. శ్రీధరణిని.. అంకమరావు హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. శ్రీధరణి కేకలు వేయడంతో తలపై కొట్టి చంపారని, సెల్‌ఫోన్ పగులకొట్టి డబ్బు తీసుకుని పారిపోయారని పోలీసులు తెలిపారు.
2017 నుంచి అంకమరావు గ్యాంగ్ వరుసగా అత్యాచారాలు చేసిందన్నారు. ఒంటరిగా తిరిగే యువతులు, జంటలే లక్ష్యంగా చేసుకునే ఈ గ్యాంగ్.. ఇప్పటివరకు 32 నేరాలు చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ప్రతి నేరం ముందు 3 రోజుల పాటు ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించేదన్నారు. ప్రధానంగా ఆదివారం ఒంటరిగా వచ్చే ప్రేమ జంటల్నే ఈ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుంటూ నేరాలకు పాల్పడుతుందన్నారు. ఇప్పటివరకు ముగ్గురు యువకులు, ఓ యువతిని అంకమరావు గ్యాంగ్ హత్య చేసిందన్నారు. ఖమ్మం, నూజివీడు, ఇబ్రహీంపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అంకమరావు గ్యాంగ్‌పై 7కేసులు నమోదయ్యాయని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా గుంటుపల్లిలో చోటు చేసుకున్న శ్రీధరణి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తొలుత బాయ్‌ఫ్రెండ్ నవీన్ హత్య చేశాడని అనుమానించారు. ఆ తర్వాత శ్రీధరణిది పరువు హత్య అనే డౌట్లు వ్యక్తం చేశారు. చివరికి అంకమరావు అండ్ గ్యాంగ్ పని అని తెలిసి విస్తుపోయారు. అంకమరావు నేరాల చిట్టాను వెలికి తీసిన పోలీసులకు అతడి నేర చరిత్రను చూసి షాక్ అయ్యారు.