కశ్మీర్ లో జైషే అమానుషం…ఇద్దరిని కిడ్నాప్ చేసి హత్య

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి మిలిటెంట్లు దాడి చేసిన ఘటన నమోదైంది. పాక్ కు చెందిన ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు స్థానిక గుజ్జర తెగలకు చెందిన ఇద్దర్ని ఎత్తుకువెళ్లి హతమార్చారు. పుల్వామా జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రాజౌరి జిల్లాకు చెందిన అబ్దుల్ ఖాదిర్ కోహ్లీ, శ్రీనగర్‌కు చెందిన మన్జూర్ అహ్మద్ కోన్మాను ఉగ్రవాదులు అపహరించారు. బుల్లెట్లు దిగిన శరీరాలను పోలీసులు గాలింపు తర్వాత గుర్తించారు.
సోమవారం ఒకరి మృతదేహాన్ని గుర్తించగా.. ఇవాళ మరో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఓ వైపు భారత్ పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతూనే మరోవైపు కశ్మీర్ విషయంలో పాక్ తన వక్ర బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. దాదాపు అన్ని దేశాలు భారత్ కు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ చైనా మద్దతుతో కశ్మీర్ విషయాన్ని అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి ఏదో సాధించాలన్న తాపత్రయంతో విఫలయత్నాలు చేస్తూ ఉంది.