ESI-IMS Scam : దేవికారాణి ఆస్తుల చిట్టా చూసి షాక్‌ అవుతున్న ఏసీబీ

  • Published By: sreehari ,Published On : September 2, 2020 / 05:39 PM IST
ESI-IMS Scam : దేవికారాణి ఆస్తుల చిట్టా చూసి షాక్‌ అవుతున్న ఏసీబీ

Updated On : September 2, 2020 / 6:13 PM IST

ESI-IMS Scam Devika Rani  : ఈఎస్‌ఐ-ఐఎంఎస్‌ స్కామ్ సూత్రధారి దేవికారాణి.. నిజంగానే అవినీతిలో రారాణి. సర్కార్‌ సొమ్మును కొట్టేయడమే కాదు.. ఆ డబ్బును ఏ రూపంలోకి మారిస్తే బెటర్‌ అన్న విషయాల్లో ఆమె ఏకంగా పీహెచ్‌డీ చేసింది. దేవిక క్రిమినల్ మైండ్‌ను అంచనా వేయడంలో ఏసీబీ అధికారులు సైతం తేలిపోతున్నారు.

ఆమె దగ్గర 10 కోట్ల విలువైన బంగారం ఉందని తెలిసినా.. ఆ గోల్డ్‌ ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నారు. ఈఎస్ఐ-ఐఎంఎస్‌ స్కామ్‌లో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 25 మంది నిందితుల ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు కళ్లు తేలేస్తున్నారు.

వీళ్లందరి దగ్గర వందల కోట్ల అస్తులు బయట పడుతున్నాయి. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి రూ.35 కోట్ల ఆస్తులున్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ 200 కోట్లపైనే ఉంటుందని అంటున్నారు అధికారులు.

తాజాగా దేవిక దగ్గర 10 కోట్ల విలువైన బంగారం ఉందని గుర్తించారు ఏసీబీ అధికారులు. దేవిక ఇంట్లో బంగారు ఆభరణాల రశీదులను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ 10 కోట్ల విలువైన బంగారం ఎక్కడ దాచిపెట్టిందో ఏసీబీ అధికారులకు అంతుపట్టడం లేదు.

ఇప్పటికే దేవికారాణి బంధువుల ఇళ్లలో సోదాలు కూడా చేశారు. ఈ విషయమై దేవిక స్నేహితులు, ఆమె కుమారుడి స్నేహితులను ఆరా తీయనున్నారు అధికారులు. మంగళవారం ఏసీబీ అధికారులు ఓ బిల్డర్ దగ్గర 4 కోట్ల 47 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇందులో 3.37 కోట్లు దేవికారాణి డబ్బుగా తేల్చారు. మిగతా డబ్బు నాగలక్ష్మికి చెందినది గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే రియల్ ఎస్టేట్‌రంగంలోని దేవిక పెట్టుబడులను గుర్తించిన ఏసీబీ.. ఆమె విదేశాల్లోనూ పెట్టుబడులు పెట్టిందని గుర్తించింది. ఆ ఆస్తులు ఎవరి పేరుమీద ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.