Radhika Yadav Case: షార్ట్స్ వేసుకోవడం, అబ్బాయిలతో మాట్లాడటం.. టెన్నిస్ ప్లేయర్ రాధిక కేసు.. సంచలన విషయాలు చెప్పిన ఫ్రెండ్
చివరికి.. వీడియో కాల్స్‌లో మాట్లాడినా.. తాను ఎవరితో మాట్లాడుతున్నానో తల్లిదండ్రులకు చూపించాల్సి వచ్చింది.

Radhika Yadav Case: హర్యానా టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కన్న తండ్రే కూతురిని కాల్చి చంపడం కలకలం రేపుతోంది. రాధిక కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాధికా యాదవ్ ప్రాణ స్నేహితురాలు హిమాన్షిక సింగ్ కీలక విషయాలు చెప్పింది.
రాధిక ఇంటి వాతావరణం చాలా కఠినంగా ఉండేదని హిమాన్షిక వెల్లడించింది. షార్ట్స్ ధరించి, అబ్బాయిలతో మాట్లాడినందుకు రాధికను ఆమె తల్లిదండ్రులు దారుణంగా అవమానించే వారని ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో తెలిపింది హిమాన్షిక.
”రాధిక తన టెన్నిస్ కెరీర్‌లో చాలా కష్టపడింది. సొంత అకాడమీని కూడా నిర్మించుకుంది. చాలా బాగా రాణిస్తోంది. కానీ ఆమె స్వతంత్రంగా ఉండటం చూసి ఆమె తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. షార్ట్స్ ధరించినందుకు, అబ్బాయిలతో మాట్లాడినందుకు, తనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడిపినందుకు వారు రాధికను దారుణంగా అవమానించారు” అని హిమాన్షిక వాపోయింది.
“మేము 2013 నుంచి కలిసి ఆడటం మొదలుపెట్టాము. కలిసి ప్రయాణించాము, కలిసి మ్యాచ్‌లు ఆడాము. ఆమె తన కుటుంబం వెలుపల ఎవరితోనూ మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె చాలా సంయమనంతో ఉండేది. ఇంట్లో ఎక్కువ ఆంక్షలు ఉండేవి. ఆమె ప్రతి కదలికను వారు నియంత్రించే వారు. చివరికి.. వీడియో కాల్స్‌లో మాట్లాడినా.. తాను ఎవరితో మాట్లాడుతున్నానో తల్లిదండ్రులకు చూపించాల్సి వచ్చింది.
నాతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలోనూ అది నేనేనని నిరూపించుకోవడానికి నేను కెమెరా ముందు కనిపించాల్సి వచ్చింది. రాధిక టెన్నిస్ అకాడమీ ఇంటి నుంచి కేవలం 50 మీటర్ల దూరంలో ఉంటుంది. అయినప్పటికీ ఎప్పుడు తిరిగి రావాలి అన్నదానిపై డెడ్ లైన్ ఉండేది. వీడియోలు, ఫోటోలు తీయడం రాధిక ఇష్టపడేది. కానీ తండ్రి పెట్టే ఆంక్షల కారణంగా క్రమంగా ఆమె అభిరుచులన్నీ కనుమరుగయ్యాయి. ఆమె ఇంట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. రాధిక స్వతంత్రంగా ఉండటం వారికి నచ్చలేదు” అని హిమాన్షిక ఆరోపించింది.
రాధికది సంప్రదాయ కుటుంబం. దాదాపు ప్రతి దాంతో సమస్యలు ఉండేవి. ప్రతి విషయంలోనూ నియంత్రణ విధిస్తూ రాధిక జీవితాన్ని ఆమె తండ్రి దుర్భరం చేశాడు. బయటకు వెళ్లాక ఏ సమయంలో తిరిగి ఇంటికి రావాలో ముందే టైమ్ చెప్పేవారు. రాధికను ఆమె తండ్రి టార్చర్ పెట్టాడు. కఠినమైన ఆంక్షలు, అవమానాలతో కుమార్తె జీవితాన్ని సంవత్సరాలుగా దుర్భరంగా మార్చాడు. రాధిక కుటుంబంపై సామాజిక ఒత్తిడి ఉంది. ప్రజలు ఏమనుకుంటారో అని తల్లిదండ్రులు నిత్యం ఆందోళన చెందేవారు. దీంతో కూతురిపై ఆంక్షలు పెట్టేవారు. ఇంట్లో తల్లిదండ్రులు పెట్టే ఆంక్షల కారణంగా తనకు ఊపిరి ఆడనట్టు ఉండేదని రాధిక పలుమార్లు నా దగ్గర ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులకు నచ్చని కొన్ని పనుల కారణంగానే రాధిక హత్యకు గురైంది” అని హిమాన్షిక్ సింగ్ చెప్పుకొచ్చింది.
Also Read: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు.. 16లక్షల విలువైన పెళ్లి ఆభరణాలు.. వెనక్కి ఇచ్చేసిన సోనమ్ కుటుంబం..
ఇక మరో మతానికి చెందిన స్వతంత్ర కళాకారిణి మ్యూజిక్ వీడియోలో రాధిక కనిపించడం చుట్టూ ఉన్న ఊహాగానాలపై హిమాన్షిక స్పందించింది. “ప్రజలు లవ్ జిహాద్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? రాధిక ఎక్కువ మందితో మాట్లాడేది కాదు. ఒంటరిగా ఉండేది. ఆమె ఇంట్లో స్వేచ్ఛ లేదు” అని హిమాన్షిక సింగ్ చెప్పింది.
గురువారం మధ్యాహ్నం రాధికా యాదవ్ తన ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్ లో కిచెన్ లో వంట చేస్తోంది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆమె తండ్రి గన్ తో ఆమెపై కాల్పులు జరిపాడు. ఐదుసార్లు కాల్చాడు. దాంతో 25ఏళ్ల రాధిక అక్కడికక్కడే చనిపోయింది. గురుగ్రామ్ సెక్టార్ 57లో సుశాంత్ లోక్ ఏరియాలోని తన ఇంట్లో తండ్రి చేతిలోనే రాధిక హత్యకు గురైంది.
రాధిక దేహం నుంచి నాలుగు బుల్లెట్లు లభ్యమయ్యాయి. వీపులో మూడు, భుజంలో ఒక బుల్లెట్ ఉంది. రాధికా యాదవ్ నెలకొల్పిన టెన్నిస్ అకాడమీ ఇంట్లో చిచ్చు రాజేసింది. ఈ టెన్నిస్ అకాడమీ విషయంలో తండ్రి, కూతురు మధ్య వివాదం తలెత్తింది. కూతురి సంపాదన మీద బతుకుతున్నాడని చుట్టుపక్కల వాళ్లు ఎగతాళి చేసేవారని, అది తట్టుకోలేకపోయిన తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.