జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీసు అధికారుల సస్పెండ్

హైదరాబాద్ : పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో అవినీతి పోలీసులకు షాక్ తగిలింది. నిందితుడు రాకేష్‌రెడ్డితో అంటకాగిన ముగ్గురు అధికారులపై డీజీపీ వేటు వేశారు. జయరాం హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని తేలడంతో ఏసీపీతో పాటు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను విధుల నుంచి సస్పెండ్ చేశారు.
చిగురుపాటి జయరామ్ హత్య కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తు ఊపందుకుంది. జయరాం హత్య కేసులో నిందితులకు సహకరించిన ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, రాంబాబులను సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జయరామ్ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలంటూ రాకేష్‌రెడ్డికి ఈ ముగ్గురు అధికారులు సలహా ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు పోలీసు అధికారులకు లభ్యమయ్యాయి. అంతేకాదు రాకేష్‌రెడ్డితో కలిసి పలు ఆర్థిక లావాదేవీలు కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాకేష్‌రెడ్డి చేసిన పలు భూదందాల్లోనూ వీరి హస్తముందని నిర్ధారించారు.
జయరాం హత్య జరిగిన రెండు నెలల తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. హత్య జరిగిన తర్వాత రాకేశ్‌రెడ్డి ఈ ముగ్గురు పోలీసు అధికారులతో సంభాషించినట్టు ఆరోపణలు వచ్చాయి. వారి సూచనల మేరకే జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు చిత్రీకరించి… నందిగామ సమీపంలో కారులో వదిలి వెళ్లినట్టు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని కృష్ణా జిల్లా ఎస్పీ తెలంగాణ పోలీసుల దృష్టికి తేవడం, జయరాం కేసును హైదరాబాద్ పోలీసులకు అప్పగించడంతో ముగ్గురి పాత్రపై దర్యాప్తు జరిగింది. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో డీజీపీ చర్యలు చేపట్టారు. జయరాం హత్య కేసులో రాకేష్‌రెడ్డితో పాటు అతడికి సహకరించిన మరికొందరిని ఇప్పటికే అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.
చిగురుపాటి జయరామ్ జనవరి 31న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ టెన్‌లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన మృతదేహం కృష్ణా జిల్లా నందిగామలో మరుసటి రోజు కారులో లభ్యమైంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రాకేష్‌తో పాటు వాచ్‌మెన్ శ్రీనివాస్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. రాకేష్‌రెడ్డి, జయరామ్ మధ్య జరిగిన ఘర్షణతో పిడిగుద్దుల వల్లే జయరామ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. జయరాంని రాకేష్ డబ్బు కోసం హైదరాబాద్‌లో హత్య చేసి… జగ్గయ్యపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఈ వ్యవహారం బయటపడటంతో… ప్రస్తుతం రాకేష్‌రెడ్డితో పాటు అతడికి సహకరించిన మరికొందరు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు.