Banjara Hills Car Accident Case : బంజారాహిల్స్ కారు ప్రమాదం కేసులో ఇద్దరు అరెస్ట్
స్వయంగా డ్రైవ్ చేసిన కారు ఓనర్ రోహిత్ గౌడ్ ఆల్కహాల్ పర్సంటేజ్ 70% ...అతని పక్క సీట్ లో కూర్చున్న సుమన్ ఆల్కహాల్ పర్సంటేజ్ 58% గా నమోదు అయ్యింది.

Banjara Hills Car accident Case
Banjara Hills Car Accident Case : హైదరాబాద్ బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 2లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన కారు బీభత్సం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను కారు ఢీకొట్టటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు రెయిన్‌బో ఆసుపత్రిలో పనిచేసే త్రిభువన్(23), ఉపేందర్(25)లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపిన యజమాని ఉప్పల్‌కు చెందిన రోహిత్ గౌడ్, అతని పక్కన కూర్చున్న సుమన్… ఇద్దరు మద్యం సేవించారని పోలీసుల విచారణలో వెల్లడైంది. స్వయంగా డ్రైవ్ చేసిన కారు ఓనర్ రోహిత్ గౌడ్ ఆల్కహాల్ పర్సంటేజ్ 70% …అతని పక్క సీట్ లో కూర్చున్న సుమన్ ఆల్కహాల్ పర్సంటేజ్ 58% గా నమోదు అయ్యింది.
వాహన ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు గుర్తించారు. కారు ప్రమాదం జరిగిన తర్వాత నిందితుడు.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు పారిపోవాలని చూడగా…. ఆ ప్రాంతంలో డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ పోలీసులకు సమాచారం అందించటంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు, ఆల్కహాల్ పరీక్షల అనంతరం ఇద్దరినీ పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఎం.వి.యాక్ట్ 185, ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.