Road Accident
Road Accident : తెలంగాణలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. నిర్మల్ జిల్లాలో ఒకరు మృతి చెందగా, పెద్దపల్లి జిల్లాలో మరొకరు మరణించారు. షిర్డీకి వెళ్లి తిరిగొస్తుండగా విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మరో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరం చెందారు. షిర్డీకి వెళ్లి తిరిగొస్తుండగా నిర్మల్ జిల్లా భైంసా సమీపంలోని నాగదేవత ఆలయ దగ్గర కారు, లారీ ఢీకొన్నాయి.
దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒక బాలుడు స్పాట్ లోనే మృతి చెందాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం భైంసా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన బాలుడు ఆదిత్యగా గుర్తించారు.
మరొక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. పెద్దపల్లి పట్టణంలో లారీని ఢీకొని ఒకరు మృతి చెందారు. యూరియా లోడుతో హైదరాబాద్ వైపు వెళ్తోన్న లారీ రంగంపల్లి దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉంది. అయితే శుక్రవారం తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న వ్యక్తి లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు.
తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.