కల్తీ కాటు : చావు భోజనానికి వెళ్లి 100 మంది చనిపోయారు

కల్తీ కాటు : చావు భోజనానికి వెళ్లి 100 మంది చనిపోయారు

Updated On : February 9, 2019 / 10:11 AM IST

బంధువు చనిపోయాడని వెళ్లి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన ఘటన ఇరు రాష్ట్రాలను కలచివేసింది.  ఉత్తరాఖండ్‌ ఏడీజీ (శాంతి భద్రతలు) అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ.. హరిద్వార్‌ జిల్లా బలూపూర్‌ గ్రామంలో ఓ ఇంట్లో చావు భోజనానికి సన్నిహితులంతా వచ్చారు. బాలుపూర్, సమీప గ్రామాలతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లా సహరాన్‌పూర్‌కు చెందిన బంధువులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. ఆనవాయితీ అనుకున్నారో.. విందులో భాగమనుకున్నారో వచ్చిన వారికి మద్యం అందించారు. 

 

కల్తీ మద్యం అనే విషయాన్ని తెలుసుకోలేకపోయిన వాళ్లు.. ఫుల్లుగా తాగేసి, ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పురాకు కూడా తీసుకెళ్లారు. ఈ తంతుకు వచ్చిన వారిలో చాలామంది వరకూ మృత్యువాత చెందడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరుసగా తెలిసిన వారంతా చనిపోతుండటంతో పోలీసులు విచారణ జరపగా నిజాలు బయటికొచ్చాయి.

 

ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటుగా రాష్ట్రంలో పలు వేడుకల సందర్భంగా కల్తీ మద్యం విరివిగా అమ్ముడుపోయిందట. దానిని తాగిన వారిలో 92 మంది చనిపోయారు. నైతిక బాధ్యతగా సంబంధింత ప్రాంతాలకు చెందిన ఎక్సైజ్, పోలీస్‌ శాఖల 17 మంది ఉద్యోగులను ఉత్తరఖాండ్ సస్పెండ్‌ చేసింది.

 

ఉత్తరప్రదేశ్‌ కూడా 10 మంది పోలీస్‌ సిబ్బందిని విధులను తొలగించింది. చనిపోయిన వారి వివరాలిలా ఉన్నాయి. మీరట్‌లో 18మంది, సహరాన్ పూర్ 46మంది, రూర్కే 20మంది, కుషీ నగర్ 8మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ఉత్తరాఖాండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రూ. 2లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించారు. అస్వస్తతకు గురై చికిత్స తీసుకుంటున్న వారికి మనిషికి రూ. 50వేలు చొప్పును అందజేస్తామని తెలిపారు.