నారాయణ విద్యాసంస్థల ఏజీఎం పద్మనాభరెడ్డి ఇంట్లో సోదాలు

నెల్లూరు : ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తెలుగు రాష్ట్రాల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. ఇటీవలే నారాయణ విద్యా సంస్థలకు చెందిన పలువురు ఉద్యోగులు నగదు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. ఏప్రిల్ 5 శుక్రవారం నెల్లూరులోని బాలాజీ నగర్ లో నారాయణ విద్యా సంస్థల ఏజీఎం పద్మనాభరెడ్డి ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ఆయన ఇంట్లో డబ్బులు దాచారన్న సమచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. రూ.15 లక్షలు, జాబితాను స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు నగదు దాచినట్లు అధికారులు గుర్తించారు.
అయితే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి ఎవరి డబ్బులు అని పద్మనాభరెడ్డిని అధికారులు ప్రశ్నించారు. అయితే అతను పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరులో 15 రోజుల క్రితం నారాయణ విద్యాసంస్థ ఉద్యోగులు రెండు ప్రాంతాల్లో డబ్బులు పంపిణీ చేస్తుండటంతో అక్కడున్న వైసీపీ కార్యకర్తలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారిపై కేసులు కూడా నమోదు చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున నారాయణ విద్యా సంస్థల అధినేత, మంత్రి నారాయణ, వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు.