Visakha Sai Case : రూ.12లక్షల కెమెరా కోసమే హత్య..! సంచలనం రేపిన విశాఖ ఫోటోగ్రాఫర్ సాయి కేసులో వీడుతున్న మిస్టరీ

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. షణ్ముఖ్ తండ్రిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.

Visakha Sai Case : రూ.12లక్షల కెమెరా కోసమే హత్య..! సంచలనం రేపిన విశాఖ ఫోటోగ్రాఫర్ సాయి కేసులో వీడుతున్న మిస్టరీ

Visakha Sai Case

Visakha Sai Case : సంచలనం రేపిన విశాఖ సాయి మృతి కేసులో చిక్కుముడి వీడుతోంది. కెమెరా కోసమే సాయిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులు కూడా ఫోటోగ్రాఫర్స్ కావడంతో అనుమానాలు నిజమయ్యాయి. సాయి హత్యకు షణ్ముఖ్ అతడి స్నేహితుడు సహకరించినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు షణ్ముఖ్ తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. షణ్ముఖ్ తండ్రిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.

విశాఖ సాయి కేసులో చిక్కుముడి వీడిందని చెప్పాలి. కలిసి వెడ్డింగ్ వీడియోస్, షూట్స్ చేసుకుందామని నమ్మబలికి సాయిని రాజమండ్రికి రప్పించాడు షణ్ముఖ్. రాజమండ్రి రైల్వే స్టేషన్ కు వచ్చాక కారులో సాయిని తీసుకెళ్లి.. షణ్ముఖ్, అతడి స్నేహితుడు వినోద్.. ఇద్దరూ కలిసి సాయిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సాయిని కారులో హత్య చేసిన తర్వాత ఆలమూరు మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో గోదావరి మధ్యలో ఇసుక తిన్నెల నడుమ మృతదేహాన్ని పూడ్చేశారు.

‘ఫోటో షూట్ ఈవెంట్ ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాడు. 12 లక్షల విలువైన కెమెరాలు తీసుకుని వెళ్లాడు. ఎవరో తెలియని వాళ్లతో ఫోటోగ్రఫీకి వెళ్తున్నాను. నచ్చితే రెండు రోజులు ఉంటాను. లేకపోతే వెనక్కి వచ్చేస్తాను అని చెప్పాడు. నా నెంబర్ కలవకపోతే ఈ నెంబర్ కి కాల్ చేయి అని మరో నెంబర్ ఇచ్చాడు. నా కొడుకు నాకు చెప్పిన చివరి మాట అదే. 27వ తేదీన ఉదయం నేను రెండు నెంబర్లకు ఫోన్ చేశా. స్విచ్చాఫ్ వచ్చాయి.

నాకు అనుమానం కలిగింది. మా అన్నయ్యతో విషయం చెప్పాను. ఎవరో తెలియని వ్యక్తులతో వెళ్లానని చెప్పాడని మా అన్నతో చెప్పాను. ఇప్పుడు రెండు నెంబర్లు స్విచ్చాఫ్ వస్తున్నాయి అని చెప్పాను. ఆ తర్వాత నా ఫోన్ చెక్ చేస్తే కారు నెంబర్ కూడా ఉంది. కారు నెంబర్ ఆధారంగా ట్రాక్ వాళ్లను ట్రాక్ చేశారు. మేము 28వ తేదీన సాయంత్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. ఈవెంట్ లలో ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయరు, సిగ్నల్ అందదు. కంగారు పడొద్దు అని పోలీసులు చెప్పారు. నా కొడుకు తిరిగి వస్తాడని అనుకున్నాను. ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు’ అంటూ మృతుడు సాయి తల్లి కన్నీరుమున్నీరు అయ్యారు.

”కెమెరా కోసమే హత్య చేశామని చెబుతున్నారు. ఇందులో ఆ ముగ్గురే కాదు ఇంకా ఎవరో ఉండే ఉన్నారు. తన సొంత డబ్బులతో కెమెరాలు కొన్నాడు. జీవితంలో ఎదుగుదలకు వచ్చాడు. నా కొడుకుని ట్రాప్ చేశారు” అని మృతుడు సాయి తల్లి బోరున విలపించారు.

కాగా, సాయి తండ్రి శ్రీనివాస్ ఆటో డ్రైవర్. సాయి లేడు అనే వార్త తెలిసి కుటుంబసభ్యులు షాక్ లో ఉన్నారు. ఈ కేసులో పోలీసులు సరిగా స్పందించలేదని సాయి కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతదేహం చూసేందుకు కూడా లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ కేసులో కీలక పరిణామం.. రూ.580 కోట్ల ఆస్తులు ఫ్రీజ్