Love Cheating : ఒకే అమ్మాయి 3 పేర్లు,3 ఫోన్ నెంబర్లతో ప్రేమాయణం..చివరికి….
ఒకే యువతి 3 పేర్లు, 3 ఫోన్ నెంబర్లతో యువకుడితో ప్రేమాయణం నడిపి... అతడ్ని బెదిరించి యువకుడి చావుకు కారణమైన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.

Love Cheating
Love Cheating : ఒకే యువతి 3 పేర్లు, 3 ఫోన్ నెంబర్లతో యువకుడితో ప్రేమాయణం నడిపి… అతడ్ని బెదిరించి యువకుడి చావుకు కారణమైన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మెరిపిరాలకు చెందిన మైలపాక సందీప్ కుమార్ (23) అనే యువకుడు మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అతని సోదరితో కలిసి చదువుకున్న దుగ్గోండి మండలం లక్ష్మీపురానికి చెందిన స్రవంతి ఫోన్‌లో సందీప్ కు పరిచయం అయ్యింది.
సోదరి క్లాస్ మేట్ కావటంతో తరచూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో తాను సందీప్‌ను ప్రేమిస్తున్నట్లు తెలిపింది. సందీప్ అందుకు అంగీకరించాడు. కొన్నాళ్లకు ఆమె మరో రెండు వేర్వేరు నెంబర్లతో, వేర్వేరు పేర్లతో (కావ్య,మనీషా) సందీప్ కు ఫోన్ చేయటం మొదలెట్టింది. తానే ముగ్గురు వేర్వేరు అమ్మాయిల్లా వ్యవహరిస్తూ..సందీప్ తో మాట్లాడుతూ నేను ప్రేమిస్తున్నానంటే.. నేను ప్రేమిస్తున్నానని ముగ్గురులా చెప్పుకొచ్చింది.
సందీప్, స్రవంతి కేవలం ఫోన్ లో మాట్లాడుకోవటం తప్ప ఎప్పుడూ పర్సనల్ గా కలుసుకున్నది లేదు. తాను ఇప్పటికే స్రవంతి అనే యువతిని ప్రేమిస్తున్నానని… మిమ్ములను ప్రేమించలేనని కావ్య, మనీషాలకు చెప్పేశాడు. ఈ క్రమంలో స్రవంతి వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. అయినా ఆమె కావ్య..మనీషాల లాగా అతడితో మాట్లాడుతూనే ఉంది.
మనీషా పేరుతో ఫోన్ చేసి.. స్రవంతి పెళ్లి అయిపోయింది కదా.. నన్ను పెళ్లి చేసుకో అనేది. కావ్య పేరుతో ఫోన్ చేసినప్పుడు కూడా అలాగే అడిగేది. అయితే సందీప్ తాను ఒకే అమ్మాయిని ప్రేమించానని, ఆమె పెళ్లయిపోయింది కాబట్టి ఇక ఎవరినీ ప్రేమించలేనని చెప్పేవాడు. ఆరు నెలలు దాదాపు ఇద్దరి మధ్య ఇలాంటి మాటలతోనే కాలం గడిచింది. తర్వాత స్రవంతి భర్తను వదిలేసి వచ్చిందని, కాబట్టి తనను ప్రేమించకపోయినా పర్వాలేదుకానీ.. ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ మిగతా ఇద్దరి పేర్లతో ఫోన్ చేసి వేధించడం ప్రారంభించింది.
అయితే సందీప్.. తాను గతంలో ప్రేమించానని, తనను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాక మళ్లీ ఆమెను ఎలా పెళ్లి చేసుకుంటానని చెప్పి తిరస్కరించే వాడు. నువ్వు ప్రేమించావు కనుకే ….నీ కోసమే భర్తను వదిలేసి వచ్చిందని, పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని ఆ రెండు పేర్లతో ఫోన్‌లో మాట్లాడుతూ బెదిరించడం మొదలుపెట్టింది.
ఆమె బెదిరింపులకు భయపడిపోయిన సందీప్ ఆగస్ట్ 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సందీప్ కన్నుమూశాడు. మృతుడి తండ్రి సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.