Love Murder : ప్రేమ హత్య : కరోనాతో చనిపోయాడని మాఫీ చేసే యత్నం

బంధువుల అమ్మాయిని ప్రేమించాడని ఒక యువకుడిని తీవ్రంగా కొట్టారు కొందరు వ్యక్తులు. ఆ దెబ్బలకు యువకుడు మరణిస్తే కరోనాతో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు చేయబోయారు. మృతుడి ఒంటిపై దెబ్బలతో అసలు బాగోతం బయటపడటంతో ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసినఘటన నిజమాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

Love Murder : ప్రేమ హత్య : కరోనాతో చనిపోయాడని మాఫీ చేసే యత్నం

Dead Body

Updated On : May 23, 2021 / 3:29 PM IST

Love Murder : బంధువుల అమ్మాయిని ప్రేమించాడని ఒక యువకుడిని తీవ్రంగా కొట్టారు కొందరు వ్యక్తులు. ఆ దెబ్బలకు యువకుడు మరణిస్తే కరోనాతో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు చేయబోయారు. మృతుడి ఒంటిపై దెబ్బలతో అసలు బాగోతం బయటపడటంతో ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన నిజమాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని కమ్మరపల్లి మండలం హాసాకొత్తూరుకి చెందిన మాలవత్ సిధ్దార్ధ(17) అనే యువకుడు, స్ధానిక రాజకీయ నాయకుడు కనకరాజేష్ బంధువైన యువతితో ఐదారు నెలలుగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ సోషల్ మీడియాలో చాటింగ్ లు చేసుకుంటూ ప్రేమలోకంలో  విహరిస్తున్నారు. ఈవిషయం రాజేష్ కు తెలిసింది.  తన మిత్రులు దోన్‌పాల్‌ పృథ్వీరాజ్, జుంబరాత్‌ అన్వేష్‌తో కలిసి..  ప్రేమ వ్యవహారం మానుకోమని సిద్దార్థను బెదిరించాడు.

ఆ తర్వాత అతని అన్నయ్య కృష్ణను కూడా హెచ్చరించారు.  వీరి హెచ్చరికలను లెక్క చేయకుండా సిద్ధార్ధ, ఆ యువతి ప్రేమాయణం కొనసాగించ సాగారు. ఎలాగైనా సిధ్దార్ధను కొట్టి,  భయపెట్టైనా వారిద్దరినీ దూరం చేయాలనుకున్న రాజేష్ ప్లాన్ వేశాడు.  ఈక్రమంలో గత బుధవారం మే 19న నందిపేట్‌కు చెందిన సల్మాన్, రాకేష్‌ను హాసాకొత్తూర్‌కు రప్పించి సిద్దార్థపై దాడికి యత్నించారు. కానీ ప్లాన్ వర్కవుటే కాలేదు.

అదే రోజు రాత్రి సిద్దార్థ స్నేహితుడైన  అదే గ్రామానికి చెందిన షేరాల బాలాగౌడ్‌ను కలిసి సిద్దార్థకు ఫోన్‌ చేసి పిలిపించాడు. సిద్దార్థ రాగానే ద్విచక్ర వాహనాలపై మెట్ల చిట్టాపూర్‌ రోడ్డులోని బర్రెల మంద వద్దకు తీసుకెళ్లారు.  అక్కడ కర్రలతో విపరీతంగా కొట్టారు. సిధ్ధార్థకు ఒంటిపై తీవ్ర గాయాలు కావటంతో,  ద్విచక్ర వాహనంపై  గ్రామానికి తీసుకు వచ్చి బాలాగౌడ్‌తో బట్టలు తెప్పించి సిద్దార్థకు వేశారు.

ఆరాత్రి సిధ్దార్థను ఇంటికి పంపకుండా బాలాగౌడ్‌ ఇంటి వద్దే పడుకోబెట్టారు.  అర్ధరాత్రి దాటాక సిద్దార్థ  ఆరోగ్య పరిస్థితి విషమించింది.  అతనికి ఊపిరి ఆడకపోవటంతో బాలాగౌడ్‌ రాజేష్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు.  రాజేష్‌, బాలాగౌడ్‌ ఇద్దరూ కలిసి సిద్దార్థను  తన కారులో మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు చెప్పారు. తెల్లవారుజామున ఉప సర్పంచ్‌ రాజేశ్వర్‌కు ఫోన్‌ చేసి, సిద్దార్థ కోవిడ్‌తో మరణించాడని చెప్పి అంత్యక్రియలకు  ఏర్పాటు చేయాలని కోరాడు రాజేష్.

గ్రామానికి చెందిన పీఎంపీ వైద్యుడు మథీన్‌తో ముందుగానే మాట్లాడి కరోనా కారణంగామే సిధ్ధార్థ చనిపోయినట్లు  రాజేశ్వర్‌కు చెప్పించాడు.  కుటుంబీకులకు కూడా కరోనా మృతిగానే మరణించినట్లు సమాచారం  అందించాడు.  అంబులెన్స్‌కు కూడా కరోనా మృతిగానే చెప్పి  మృతదేహాన్ని ఆర్మూర్‌ ప్రభుత్వాస్పత్రికి చేర్చాడు.

కరోనాతో మృతి చెందాడని చెప్పగా, సిద్దార్థ కుటుంబ సభ్యులు అనుమానించి ఆర్మూర్‌లో మృతదేహాన్ని పరిశీలించారు.  మృతదేహంపై గాయాలు ఉండడంతో ఆరా తీశారు.  ఎవరో కొట్టిన దెబ్బలవల్ల,  తీవ్ర గాయాలతోనే మృతి చెందిన విషయం బయట పడింది.

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన పోలీసుల విచారణ చేపట్టారు. ఈ హత్యకేసు గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులకు దారితీసింది. గురువారం మృతుని కుటుంబ సభ్యు లు, గ్రామస్తుల ఆందోళనతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

అయితే పోలీసు స్టేషన్లో నిందితులు భోజనాలు చేస్తున్న ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకున్నారు.  ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌  అయ్యింది.  ఇది చూసిన గ్రామస్తులు కోపంతో రగిలిపోయారు.  నిందితులకు పోలీసులు రాచమర్యాదలు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహంతో ఆందోళనకు పూనుకున్నారు.

గ్రామంలోకి వచ్చిన  పోలీసుల వాహనం అద్దాలు పగుల గొట్టారు.  మోహరించిన పోలీసు బలగాలను, అధికారులను గ్రామం  నుంచి బయటకు పంపించేశారు. నిందితుడు కనక రాజేశ్‌ ఇంటిపై దాడి చేసి ఇంట్లోని సామగ్రి ధ్వంసం చేశారు.  ఈ కేసులో రాజేష్‌తో పాటు, పృథ్వీరాజ్, అన్వేష్, బాలాగౌడ్, మథీన్‌ను లను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న సల్మాన్, రాకేష్‌ ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసుదర్యాప్తు కొనసాగుతోంది.