IT Jobs: ఐటీ ఉద్యోగులకు షాక్..! కంపెనీలకు యూఎస్ మాంద్యం ఎఫెక్ట్.. ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ మూడేళ్ల కష్టానికి..
రాబోయేకాలంలో ఐటీ సెక్టార్‌లో ఉద్యోగుల రిక్రూట్‌మెంట్ తగ్గిపోవటానికి ప్రధాన కారణం యూఎస్ మాంద్యం ప్రభావమేనని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో ఏర్పడిన మాంద్యం కారణంగా ఐటీ సంస్థల చేతిలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల అమలును నిలిపివేస్తున్నాయి.

Indian IT industry
Indian IT industry : భారత్‌లో ప్రతీయేటా ఐటీ రంగంలో చేరుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. గ్రాడ్యుయేట్ పూర్తయిన ఇంజనీర్లలో ప్రతిభావంతులను ఎంపికచేసి కంపెనీలు ఫ్రెషర్స్ రూపంలో రిక్రూట్ చేసుకోవటం ప్రతీయేటా జరిగేదే. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ పరిస్థితి కనిపించక పోవవచ్చని, ఐటీ ఉద్యోగాల కొరత ఏర్పడవచ్చునని అంచనా. స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ టీమ్‌లీజ్ నుండి బిజినెస్‌లైన్ ద్వారా సేకరించిన డేటా ప్రకారం.. కరోనా మహమ్మారి తరువాత రెండేళ్లు ఆయా కంపెనీలు మెరుగైన రిక్రూట్ మెంట్‌ను కలిగి ఉన్నాయి. అయితే, 2024 ఆర్థిక సంవత్సరంకోసం ఫ్రెషర్ రిక్రూట్‌మెంట్ సంఖ్య మూడేళ్లలో అత్యల్పంగా ఉంటుందని బిజినెస్‌లైన్ ద్వారా సేకరించిన డేటా వెల్లడించింది.
2022 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేకించి లాక్‌డౌన్ సమయంలో ఐటీ రంగానికి చెందిన డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లో కంపెనీలు దక్కించుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి భారతీయ ఐటీ కంపెనీలు 3.9లక్షల మంది కొత్త గ్రాడ్యుయేట్ లను రిక్రూట్ చేసుకున్నాయి. వీరిలో ఇంజనీరింగ్ చదువుతుండగా క్యాంపస్ రిక్రూట్స్‌మెంట్‌లో ఎంపికైన వారు 26శాతం మంది ఉన్నారు. ఆ తరువాత 2023లో నియామకాల సంఖ్య 2.8లక్షలకు చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల రిక్రూట్‌మెంట్ 1.55 లక్షల వరకు మాత్రమే ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
రాబోయేకాలంలో ఐటీ సెక్టార్‌లో ఉద్యోగుల రిక్రూట్‌మెంట్ తగ్గిపోవటానికి ప్రధాన కారణం యూఎస్ మాంద్యం ప్రభావమేనని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో ఏర్పడిన మాంద్యం కారణంగా ఐటీ సంస్థల చేతిలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల అమలును నిలిపివేస్తున్నాయి. దీనికితోడు కొత్త ప్రాజెక్టులుకూడా రాకపోవటంతో భారత్‌లో ఐటీ కంపెనీలు ఇంతకుముందు విధంగా కొత్త ఇంజనీర్లను నియమించాల్సిన అవసరం లేకుండా పోయిందని తెలుస్తోంది. మరోవైపు వేగంగా విస్తరిస్తున్న AI (Artificial intelligence) వల్ల కొత్తగా ఐటీ ఉద్యోగాల రిక్రూట్ మెంట్‌పై ప్రభావం ఉంటుందన్న వాదన ఉంది. అయితే, ఏఐ విస్తరణ వల్ల ఐటీ రంగంలో కొత్త ఇంజనీర్ల రిక్రూట్‌మెంట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే, ఈ ఏడాది టాప్ ఐదు ఐటీ సంస్థలు ఇంజనీరింగ్ కళాశాలల్లో క్యాంప్‌ల ద్వారా 10శాతం కంటే తక్కువ మందిని నియమించుకోవచ్చని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. TCS, Infosys, Wipro వంటి కంపెనీలు దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందిన కంపెనీలు. ప్రతీయేటా అవుట్ గోయింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో చాలా మందికి ఈ కంపెనీలు మంచి ఉద్యోగాలను అందిస్తూ వస్తున్నాయి. ఈ ఏడాది యువ ఇంజనీర్లకు ఆశించిన స్థాయిలో రిక్రూట్ మెంట్లు ఉండవని ఐటీ సంస్థలు సూచిస్తున్నాయి. TCS ఇప్పటికే కొత్త రిక్రూట్‌మెంట్లను ఆన్‌బోర్డు చేయడంలో ఇటీవల మూడు నెలలు ఆలస్యం చేసింది.